రవితేజ ఆమెను వదలట్లేదు..

Thu Sep 14 2017 14:14:26 GMT+0530 (IST)

రవితేజకు ఇప్పుడు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా రాశి ఖన్నా పేరు చెప్పేయొచ్చేమో. ఇప్పటికే ఈ బబ్లీ బ్యూటీతో ‘బెంగాల్ టైగర్’ సినిమా చేశాడు రాశి. ఇంతకుముందు హోమ్లీగా కనిపించిన రాశి.. ‘బెంగాల్ టైగర్’లో మాత్రం అందాలు ఆరబోసి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని తర్వాత రవితేజ కమిటైన కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’లో కూడా రాశి ఖన్నా కథానాయికగా ఎంపికైంది. ‘టచ్ చేసి చూడు’తో పాటుగా మాస్ రాజా మొదలుపెట్టిన మరో సినిమా ‘రాజా ది గ్రేట్’లోనూ రాశి ఖన్నా కనిపించబోతుండటం విశేషం. ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో రాశి ఒక ఐటెం సాంగ్ చేయబోతోంది. ఇటీవలే ఆ పాట చిత్రీకరణ కూడా మొదలైందట. రాశికి ఇదే తొలి ఐటెం సాంగ్ కావడం విశేషం. శ్రుతి హాసన్.. కాజల్ అగర్వాల్.. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తున్న నేపథ్యంలో రాశికి ఈ విషయంలో పెద్దగా అభ్యంతరాలేమీ లేవు. సినిమాకు ఈ పాట ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. రాశి ఇంతకుముందు దిల్ రాజు-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘సుప్రీమ్’లో కథానాయికగా నటించింది. అందులో ఆమె పాత్ర భలే పేలింది కూడా. ఆ రకంగా వాళ్లిద్దరికీ కూడా రాశి లక్కీనే. రవితేజ అంధుడిగా నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబరు 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.