ఆర్.ఎక్స్ దర్శకుడికి అదిరే గిఫ్ట్

Sat Aug 11 2018 10:01:28 GMT+0530 (IST)

100 కు 1000 లాభం ఇస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలాంటి కిక్కునే ఇచ్చింది ఆర్.ఎక్స్ 100. పెట్టిన పెట్టుబడికి నాలుగైదు రెట్లు లాభాలు అందుకున్నారు మేకర్స్. తెలుగు కుర్రాడు కార్తికేయ అద్భుతమైన నటనాభినయం - పాయల్ రాజపుత్ గ్లామర్ - డేరింగ్ యాక్ట్ ఈ సినిమా విజయానికి ప్రధాన ఆయుధాలుగా పని చేశాయి. టోటల్ టీమ్‌ని ఎగ్జిక్యూట్ చేయడంలో వర్మ శిష్యుడు అజయ్ భూపతి అంతే పెద్ద సక్సెసయ్యారు. చిన్నపాటి తప్పిదాల్ని తేలిగ్గా క్షమించి - తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాని నెత్తిన పెట్టుకుని ఆదరించారు. ఫలితంగా నిర్మాతలు - పంపిణీదారులకు భారీగా లాభాలు దక్కాయి.ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అనుకున్నారో ఏమో.. ఇదిగో దర్శకుడు అజయ్ భూపతికి అదిరిపోయే జీప్ కార్ ని కానుకగా అందించి నిర్మాత అశోక్ గుమ్మకొండ & టీమ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రెడ్ కలర్ వెలుగు జిలుగులతో జీప్ కార్ అదిరిపోయింది. ఇక ఈ కార్‌లో యువదర్శకుడు అజయ్ భూపతి రైడ్ కి రెడీ అయిపోవచ్చు. మంచి హిట్లు ఇచ్చినప్పుడు దర్శకులు ఇలాంటి ఖరీదైన కానుకలు అందుకోవడం అన్నది టాలీవుడ్ లో అనాధిగా వస్తున్న సాంప్రదాయమే.

అప్పట్లో శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ వంటి విజయవంతమైన చిత్రాల్ని అందించిన కొరటాలకు తన హీరోలు - నిర్మాతలు అదిరిపోయే కానుకలు అందించారు. `భలే భలే మగాడివోయ్` వంటి బ్లాక్ బస్టర్ అందించిన మారుతికి అల్లు అరవింద్ ఖరీదైన కానుకనే అందించారు. సుకుమార్ - పూరి జగన్నాథ్ - త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్లు తమ హీరోలు - నిర్మాతల నుంచి ఖరీదైన కానుకలే అందుకున్నారు. ఇలాంటి సందర్భాలెన్నో ఉన్నా... తొలి సినిమాతోనే `ఆర్.ఎక్స్ 100` అజయ్ భూపతికి దక్కిన గుర్తింపు ప్రత్యేకమైనదేనని చెప్పాలి. ఈ సెలబ్రేషన్ మూడ్ లో తదుపరి సినిమాకి కావాల్సినంత బూస్ట్ దొరికినట్టే.