ట్రైలర్ టాక్ : మరో ఇంటెన్స్ లవ్ స్టొరీ

Mon May 21 2018 18:50:25 GMT+0530 (IST)

టాలీవుడ్ లో యువతరం దర్శకుల ఆలోచనలు కొత్తగా ఆవిష్కరించబడటం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు విభిన్నమైన నేపథ్యం కలిగిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తూ ఉండటంతో స్ఫూర్తి చెందుతున్న వారు కూడా లేకపోలేదు. అలాంటి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మరో మూవీ RX 100. ట్రైలర్ లో చూచాయగా కథ చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు అజయ్ భూపతి ట్రీట్మెంట్ లో కొత్తదనం చూపించాడు. చాలా రఫ్ గా ఉండే హీరో పాత్రలో కార్తికేయ మాస్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ని ఎక్కువ రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. నిలువెల్లా ఆవేశం నిండిన యువకుడికి గ్రామ పెద్దకి మధ్య జరిగే యుద్ధంలో రాజకీయాలను జొప్పించి ఒక ఆసక్తికరమైన థ్రెడ్ ను ఇందులో రాసుకున్నట్టు కనిపిస్తోంది.రావు రమేష్ మెయిన్ విలన్ గా నటించగా మరో కీలకమైన పాత్రలో   సీనియర్ హీరో రాంకీ కనిపించడం విశేషం. ఆ మధ్య దాసరి గారి సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించిన రాంకీ తరువాత తెలుగు స్ట్రెయిట్ మూవీస్ లో కనిపించడం మానేశాడు. కాస్త వయసు మళ్ళిన పాత్రలో హీరో తండ్రిగానో గార్డియన్ గానో రాంకీ చేసిన పాత్ర కీలకంగా కనిపిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా హీరో హీరోయిన్ మధ్య హాట్ కెమిస్ట్రీ ని పండించిన అజయ్ భూపతి ఈ విషయంలో మాత్రం క్లియర్ గా యూత్ ని టార్గెట్ చేసుకున్నాడు. బలమైన కంటెంట్ ఉంటే బోల్డ్ సీన్స్ ని ప్రేక్షకులు ఆదరిస్తారని అర్జున్ రెడ్డి ప్రూవ్ చేసింది కాబట్టి RX 100 కూడా అదే నమ్మకంతో కనిపిస్తోంది. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ లో వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో తక్కువే కనక వర్క్ ఔట్ అయితే మాత్రం RX 100 మంచి ఫలితం ఇచ్చేలా ఉంది. జనం ఎప్పుడో మర్చిపోయిన నిన్నటి తరం బైక్ మోడల్ ని టైటిల్ గా పెట్టుకున్న ఈ మూవీ స్టోరీ కూడా కాలం వెనక్కు తీసుకెళ్లి నడిపించారా లేక వర్తమానంలోనే హీరో అలాంటి పాత బైక్ ని సెంటిమెంట్ గా వాడాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి కొత్త టీమ్ చేసిన ప్రయత్నం నిజంగానే కొత్తగా ఉండి సినిమా మీద ఆసక్తిని పెంచడంలో ట్రైలర్ అనే మొదటి అడుగులో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.