Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘ఆర్ ఎక్స్ 100’

By:  Tupaki Desk   |   12 July 2018 4:51 PM GMT
మూవీ రివ్యూ: ‘ఆర్ ఎక్స్ 100’
X
చిత్రం: ‘ఆర్ ఎక్స్ 100’
నటీనటులు: కార్తికేయ - పాయల్ రాజ్ పుత్ - రావు రమేష్ - రాంకీ తదితరులు
సంగీతం: చేతన్ - స్మరణ్
ఛాయాగ్రహణం: రామ్
నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ
రచన - దర్శకత్వం: అజయ్ భూపతి

ఆర్ ఎక్స్ 100.. ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారిన చిన్న సినిమా. కొత్త హీరో హీరోయిన్లతో డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి తీసిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తీసుకొచ్చింది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.

కథ:

శివ (కార్తికేయ) ఓ అనాథ. తల్లిదండ్రులు కోల్పోయిన అతడిని డాడీ (రాంకీ) చేరదీస్తాడు. గోదావరి ప్రాంతంలోని ఆత్రేయపురం అనే ఊరిలో థియేటర్ నడుపుకుంటూ.. డాడీకి అండగా ఉంటూ జీవనం సాగిస్తుంటాడు శివ. ఆ ఊరి జెడ్పీటీసీ అయిన విశ్వనాథం (రావు రమేష్) కూతురు శివను చూసి ఇష్టపడుతుంది. తర్వాత అతనూ ఆమె ప్రేమలో పడతాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. ఈలోపు విశ్వనాథం.. డాడీ గొడవ పడి శత్రువులుగా మారతారు. తన ప్రేమ గురించి ఇందు ఇంట్లో చెబుదామనుకునే లోపే తండ్రికి విషయం తెలిసి పోతుంది. ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలతో శివ-ఇందు విడిపోతారు. ఆ తర్వాత శివ పరిస్థితేంటి.. అతనేం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఆర్ ఎక్స్ 100’ పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్ చూసి దీన్ని చాలామంది ‘అర్జున్ రెడ్డి’తో పోల్చారు. ఐతే లిప్ లాక్స్.. ఇంటిమేట్ సీన్లు.. బోల్డ్ కంటెంట్ వరకైతే ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి’ని మ్యాచ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ విషయంలో ఇది దాని కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. కానీ కథాకథనాల విషయంలో మాత్రం ‘అర్జున్ రెడ్డి’కి దీనికి అసలు పోలికే లేదు. ‘అర్జున్ రెడ్డి’ కూడా ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ‘బోల్డ్’ రూటే ఎంచుకున్నప్పటికీ.. సినిమాలో అది ప్రధాన విషయం కాదు. అందులో బలమైన కథ ఉంటుంది. ప్రతి సన్నివేశం కథతో పాటుగా సాగుతుంది. ఎక్కడా ఇంటెన్సిటీ తగ్గకుండా సిన్సియర్ గా ఒక కథను చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. సినిమా చూస్తున్నపుడు.. చూశాక ఆ లిప్ లాక్స్.. ఇంటిమేట్ సీన్లన్నవి అసలు చర్చలోకే రావు. వాటిని దాటి మనల్ని ఇన్వాల్వ్ చేసే కథాకథనాలు.. పాత్రలు అందులో ఉంటాయి.

కానీ ‘ఆర్ ఎక్స్ 100’ మాత్రం ప్రోమోల ద్వారా ప్రేక్షకుల్ని ఆకర్షించిన ‘బోల్డ్’ కంటెంట్ తో కుర్రాళ్ల తాపం తీర్చడమే ప్రధానంగా సన్నివేశాలు నడుస్తాయి. ఇవి కూడా కథలో భాగమే అయినప్పటికీ.. ఇక్కడ దర్శకుడు కథను చెప్పిన టోన్ వేరు. ఇందులో కథాకథనాలు ఒక తీరుగా నడవవు. సినిమా చివర్లో వచ్చే ఒక ట్విస్టును ముందు రాసుకుని.. దాన్నే నమ్ముకుని.. దాని చుట్టూ కథను అల్లినట్లుగా కనిపిస్తుంది. ఆ మలుపుతో పాటుగా చివరి అరగంటలో కథనమంతా కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. అక్కడ కథ పరుగులు పెడుతుంది. ప్రేక్షకుల్ని భావోద్వేగాలకు గురి చేసి.. డిస్టర్బ్ చేస్తాయి ఆ సన్నివేశాలు. కానీ అక్కడ కనిపించిన ఇంటెన్సిటీ.. వేగం.. ఉత్కంఠ.. ఆసక్తి.. మిగతా సినిమాలో లేకపోయింది. అలా ఉంటే మాత్రం ఇదొక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయేది.

చివరి అరగంటను విడిచిపెడితే.. మిగతా అరగంటలో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సందర్భాలు బోలెడు. తలా తోకా లేకుండా సాగుతాయి కథాకథనాలు. విపరీతమైన సాగతీత.. అనవసర సన్నివేశాలతో అసలేం చూస్తున్నామో అర్థం కాని భావన కలిగిస్తాయి. ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ మాత్రం కుర్రాళ్లకు విందు భోజనమే. టెంపరేచర్లు పెంచేస్తాయి ఆ సన్నివేశాలు. ఈ సినిమా ప్రోమోలు చూసి ఎగబడి థియేటర్లకు వచ్చిన వాళ్లందరికీ ఆ ఎపిసోడ్ పూర్తి కిక్కు ఇస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ లోని బోల్డ్ కంటెంట్ ఓ వర్గం ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చినప్పటికీ.. దాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ భరించలేరు. అది ఫ్యామిలీ ఆడియన్స్ ను పూర్తిగా సినిమాకు దూరం చేసేస్తుంది.

రొమాన్స్ విషయంలో మొహమాటాలు లేకుండా బోల్డ్ గా సన్నివేశాల్ని నడిపించిన దర్శకుడు అజయ్ భూపతి.. హీరోయిన్ పాత్రను చూపించే విషయంలోనూ అదే బోల్డ్ నెస్ చూపించాడు. మామూలుగా అమ్మాయిల పాత్రల్ని ఇలా చూపించడానికి దర్శకులు భయపడతారు. కానీ ఒక వాస్తవ కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందించిన అజయ్.. అసలేమాత్రం మొహమాట పడలేదు. చాలా షాకింగ్ గా అనిపించేలా.. జీర్ణించుకోలేని విధంగా కథానాయిక పాత్రను తీర్చిదిద్దాడు. సినిమాలో స్టన్నింగ్ గా అనిపించే విషయం అదే. దాన్ని ఎవరెలా రిసీవ్ చేసుంటారన్నది చెప్పలేం. ఓవరాల్ గా చెప్పాలంటే ‘ఆర్ ఎక్స్ 100’ రెగ్యులర్ సినిమాలకు భిన్నమైన కథాకథనాలతోనే సాగుతుంది. కానీ ఇదేదో క్లాసిక్ అన్నట్లు.. ఇలాంటి సినిమా ఇప్పటిదాకా రాలేదన్నట్లు చిత్ర బృందం ఇచ్చిన బిల్డప్ కు తగ్గ కంటెంట్ ఇందులో లేదు. ఘాటైన రొమాన్స్ ఇష్టపడే వాళ్లకు.. రస్టిక్ లవ్ స్టోరీల్ని మెచ్చే వాళ్లకు ఈ సినిమా ఓకే అనిపిస్తుంది.

నటీనటులు:

హీరో కార్తికేయ బాగానే చేశాడు. సినిమా అంతటా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయాడు కానీ పతాక సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. కార్తకేయ లుక్ ఆకట్టుకుంటుంది. పాత్రకు తగ్గ ఆహార్యంతో శివ మెప్పించాడు. హీరోయిన్ కంటే కూడా అతనే ఎక్కువగా బాడీని ఎక్స్ పోజ్ చేయడం విశేషం. డైలాగ్ డెలివరీ విషయంలో కార్తికేయ కొన్ని చోట్ల తడబడ్డాడు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సినిమాకు పెద్ద ఆకర్షణ. పాత్రకు తగ్గట్లుగా సాగిన ఆమె బోల్డ్ నెస్ కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. పాయల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇలాంటి పాత్ర చేయడానికి గట్స్ ఉండాలి. చాలా ఆత్మవిశ్వాసంతో నటించి మెప్పించింది. రావు రమేష్ తన అనుభవాన్ని చూపించాడు. విశ్వనాథం పాత్రలో ఆయన ఒక సన్నివేశంలో అదరగొట్టేశాడు. రాంకీ కూడా మెప్పిస్తాడు. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతికవర్గం:

‘ఆర్ ఎక్స్ 100’ టెక్నికల్ గా బ్రిలియంట్ అనిపిస్తుంది. చేతన్ పాటలు.. స్మరణ్ నేపథ్య సంగీతం సినిమాలకు పెద్ద బలం. ‘పిల్లా రా’తో పాటుగా రెండు మూడు పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతంలోనూ ఇంటెన్సిటీ కనిపిస్తుంది. రామ్ ఛాయాగ్రహణం సూపర్బ్. టేస్టుండాలే కానీ.. మన లోకల్ లొకేషన్లనే ఎంత బాగా చూపిస్తూ సన్నివేశాల్లో అందం తీసుకురావచ్చో అతను చూపించాడు. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగానే ఉన్నాయి. ఇక దర్శకుడు అజయ్ భూపతి.. తనకు తెలిసిన వాస్తవ కథనే సినిమాగా మలిచాడు. కథను చెప్పే తీరులో వైవిధ్యం చూపించాడు. కొన్ని సన్నివేశాల్ని చాలా బాగా డీల్ చేశాడు. చివరి అరగంటలో అతడి పనితనం కనిపిస్తుంది. ఆర్జీవీ శిష్యుడైన అజయ్ పై గురువు ప్రభావం ఉంది. అదే సమయంలో దర్శకుడిగా తన ముద్రనూ చూపించాడు.

చివరగా: ఆర్ ఎక్స్ 100.. మెరుపులు కొన్ని.. మరకలు ఎన్నో

రేటింగ్: 2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre