Begin typing your search above and press return to search.

#RRR ఆ సినిమాకు రీమేకా..?

By:  Tupaki Desk   |   14 Oct 2018 4:54 AM GMT
#RRR ఆ సినిమాకు రీమేకా..?
X
దర్శకధీరుడు SS రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ ఆసక్తి వ్యక్తమవుతుంది. ఇక బాహుబలి రెండు భాగాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాడు కాబట్టి తను నెక్స్ట్ చేయనున్న సినిమా ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ హాట్ టాపిక్. రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ లీగ్ స్టార్లు ఈ సినిమా హీరోలు కావడంతో తెలుగు ప్రేక్షకులకు ఇదో మరపురాని మల్టి స్టారర్ చిత్రంగా మారిపోయింది. ఈ ప్రాజెక్ట్ పైనున్న క్రేజ్ కు తగ్గట్టే సినిమా కథ గురించి.. హీరో పాత్రల గురించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఈ సినిమా కథ బాలీవుడ్ సినిమా 'గుండే' ఛాయలలో సాగుతుందట. అర్జున్ కపూర్ - రణవీర్ సింగ్ - ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాను తారక్ - చరణ్ ల స్టార్ ఇమేజ్ కి .. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి స్క్రిప్ట్ ను వండుతున్నారట. 'గుండే' సినిమాలోని నేపథ్యం వరకూ తీసుకోవడం సరేగానీ ఆ సినిమా రీమేక్ అంటే మాత్రం నమ్మశక్యంగా లేదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే రాజమౌళి సినిమాకోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఒక్క తెలుగు వెర్షన్ అయితే హిందీ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉంటుంది కానీ పలు భాషలలో రిలీజ్ కానున్న #RRR హిందీ సినిమా రీమేక్ అయి ఉండకపోవచ్చని వారి అభిప్రాయం.

ఏదేమైనా ఈ సినిమా కథ విషయం మాత్రం అటు జక్కన్న కానీ ఇటు తారక్ -చెర్రీలుగానీ పెదవి విప్పడం లేదు. 'అరవింద సమేత' ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ ను #RRR గురించి అడిగితే లౌక్యంగా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు గానీ ఒక్క ముక్క లీక్ చేయడం లేదు. ఇక జక్కన్న స్వయంగా ఈ సినిమా గురించి అప్డేట్స్ చెప్పేవరకూ మనం వేచి చూడక తప్పదేమో.