ఆర్ ఆర్ ఆర్ కి అక్షయ్ భయపడతాడా ?

Fri Mar 15 2019 10:11:28 GMT+0530 (IST)

నిన్న అధికారికంగా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ వచ్చే జూలై 30ని ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇక నిర్మాతలు దర్శకులు ఈ డేట్ పరిసరాల్లో తమ సినిమాలు లేకుండా జాగ్రత్త పడటం ఖాయం. రాజమౌళి ఒక్క హీరోతో చేస్తేనే దానికి పోటీగా నిలవడం కష్టం. అలాంటిది అరుదైన కాంబినేషన్ గా కొనియాడబడుతున్న కొణిదెల నందమూరి హీరోల మూవీ అంటే చెప్పేదేముంది. అంచనాలు ఆకాశాన్ని దాటి అంతరిక్షం వైపు పరుగులు పెడతాయి. అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు కాబట్టి అపోజిషన్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ.అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆర్ ఆర్ ఆర్ ప్రకటన రాక ముందే చాలా అడ్వాన్స్ గా బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తన సూర్యవంశీ విడుదలకు జూలై 30 లాక్ చేసుకుని ఇంతకు ముందే ప్రకటించాడు. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇప్పుడు సూర్యవంశీని వెనక్కు లేదా ముందుకు జరుపుతారా లేక ఏదైతే అదైంది అనుకుని అదే డేట్ కి క్లాష్ కి సై అంటారా వేచి చూడాలి.

సూర్యవంశీ రీమేక్ చిత్రమని ముంబై టాక్. రెండేళ్ల క్రితం కార్తీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వచ్చిన ఖాకీకి మసాలాలు జోడించి రోహిత్ శెట్టి దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు వార్తలు ఉన్నాయి. ఇటీవలే టెంపర్ రీమేక్ అదే స్టైల్ లో హిట్ కొట్టిన రోహిత్ శెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. సూర్యవంశీలో అక్షయ్ కుమార్ గెటప్ ఎలా ఉంటుంది అనేది సింబా చివర్లో చిన్న సన్నివేశంలో రోహిత్ గతంలోనే రివీల్ చేశాడు. పోస్టర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వస్తోంది కాబట్టి అక్షయ్ వెనుకడుగు వేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది