Begin typing your search above and press return to search.

ఆర్పీ సినిమా ఇలాగైనా వార్తల్లోకి వచ్చింది

By:  Tupaki Desk   |   31 July 2015 1:33 PM GMT
ఆర్పీ సినిమా ఇలాగైనా వార్తల్లోకి వచ్చింది
X
ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడని మరిచిపోయి చాలా కాలమైంది. ఆయన చివరగా ఏ తెలుగు సినిమాకు సంగీతాన్నందించాడో చెప్పమంటే జవాబు కోసం తడుముకోవాల్సిందే. ఆరేడేళ్లుగా ఆయన దర్శకుడిగానే చలామణి అవుతున్నాడు. ఇటు తెలుగులో రెండు సినిమాలు తీశాడు. అటు కన్నడలోనూ తీస్తున్నాడు. బ్రోకర్, ఫ్రెండ్స్ బుక్ సినిమాలు ఫ్లాపైనా దర్శకుడిగా ప్రయత్నం మానని ఆర్పీ.. ఈసారి హార్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరు.. తులసీదళం. చాన్నాళ్ల కిందటే ఈ సినిమా మొదలైంది. కానీ జనాలకు ఆ సినిమా గురించి పట్టట్లేదు. ఇంతలో ఓ వివాదం పుణ్యమా అని సినిమా వార్తల్లోకి వస్తోంది.

మన తెలుగు సీరియళ్ల టెక్నీషియన్స్ సినిమాల్లోని ట్యూన్స్ ని యథేచ్ఛగా వాడేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఓ రోజు మధ్యాహ్నం మొదలుపెట్టి రాత్రి దాకా ఓ పది సీరియళ్లు చూశామంటే చాలు.. ప్రతి సన్నివేశంలోనూ సినిమాల ట్రాక్స్ ని ఎంత యథేచ్ఛగా వాడేస్తుంటారో అర్థమైపోతుంది. ఐతే సినిమా వాళ్లు ఈ విషయం పట్టించుకోరు. లైట్ తీసుకుంటారు. ఐతే ఆర్పీ తీస్తున్న తులసీదళం సినిమాకు సంబంధించి ఇంకా రిలీజ్ కాని ట్రాక్స్ ని జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ‘అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ కోసం వాడేశారట. ఈ సంగతి ఆర్పీ దృష్టికి రావడంతో ఆయనకు మండిపోయింది. సీరియల్ నిర్మాతలపై కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నాడు. మొత్తానికి ఈ వివాదం కారణంగా ఆర్పీ ‘తులసీదళం’ అనే సినిమా చేస్తున్నసంగతి వార్తల్లోకి వచ్చింది.