Begin typing your search above and press return to search.

ఇంత ఓవర్ ఎందుకు వర్మా ?

By:  Tupaki Desk   |   20 July 2019 11:33 AM GMT
ఇంత ఓవర్ ఎందుకు వర్మా ?
X
ఇస్మార్ట్ శంకర్ వచ్చి ఇది మూడో రోజు. ఊర మాస్ కంటెంట్ వల్ల వసూళ్లు బాగుండి హిట్ దిశగా వెళ్తోంది. ఇలాంటి సక్సెస్ చూసి చాలా కాలమైన పూరి జగన్నాధ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉన్నారు. సరే విజయం వల్ల వచ్చే కిక్ ఇలాగే ఉంటుంది కాబట్టి దాన్నిఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కాని తన శిష్యుడు పొందిన హిట్ ని చూసి రామ్ గోపాల్ వర్మ ఒళ్ళు మరిచి మరీ పూనకాలు వచ్చే రేంజ్ లో నిన్న పబ్ పార్టీలో రెచ్చిపోవడం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

వాస్తవానికి పబ్లిక్ లో మందు కొట్టడమే తప్పు. అలాంటిది దాంతో చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ వీడియోలు తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఇంకేమనాలో అర్థం కావడం లేదు. నిన్న ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ని పురస్కరించుకుని జరిగిన కాక్ టైల్ పార్టీలో వర్మ చేసిన రచ్చ మాములుగా లేదు. చాలా ఓవర్ అనిపించేలా పైపెచ్చు వచ్చినవాళ్ళను ఇబ్బంది పెట్టేలా ఉండటం కెమెరా దృష్టి దాటిపోలేదు

బాటిల్ లో మద్యాన్ని బాగా ఊపేసి గాల్లో చల్లడం పక్కనే హీరోయిన్లు నిధి అగర్వాల్ - నభ నటేష్ లతో పాటు నిర్మాత చార్మీ అమ్మాయిలనే సంగతి మర్చిపోయి వాళ్ళ తల మీద పడేలా గాల్లోకి చల్లడం ఇదంతా ఒకరకంగా ఎబ్బెట్టుగా ఉందనే చెప్పాలి. అంతే కాదు అదే ఊపులో ఛార్మీకి కౌగిలింతలు బుగ్గ మీద గట్టిగా ముద్దులు గుప్పించేసిన వర్మ ఏ దశలోనూ స్పృహలో ఉన్నట్టుగా కనిపించలేదు.

నిధి అగర్వాల్ ఇబ్బందిని గమనించిన పూరి తనకు నభకు పేపర్ నాప్కిన్స్ ఇచ్చి మొహాలు తుడుచుకోమని చెప్పడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో. ఇలా మందు కొట్టి చిందులు వేయడాన్ని పార్టీ అంటారని వర్మ లాంటి సీనియర్లే ఇంత ప్రత్యక్షంగా చూపిస్తుంటే ఇక అతన్ని గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలా