Begin typing your search above and press return to search.

అంత మాట అనేశారేంది నారాయ‌ణ‌మూర్తి!

By:  Tupaki Desk   |   24 July 2017 9:47 AM GMT
అంత మాట అనేశారేంది నారాయ‌ణ‌మూర్తి!
X
సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంత‌మంది ఉన్నా.. వారికి కాస్త భిన్న‌మైన ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు సినీ న‌టుడు.. ద‌ర్శ‌క నిర్మాత అయిన కామ్రేడ్ నారాయ‌ణ‌మూర్తి. సినిమా లాంటి గ్లామ‌ర్ రంగంలో సుదీర్ఘ‌కాలం ఉంటూ.. త‌న క‌మ్యూనిస్ట్ భావ‌జాలాన్ని కొన‌సాగించ‌టం.. తాను న‌మ్మిన సిద్దాంతానికి క‌ట్టుబ‌డి ఉండ‌టం నారాయ‌ణ‌మూర్తి ప్ర‌త్యేక‌త‌లుగా చెప్పాలి.

ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడ‌తార‌ని పేరున్న నారాయ‌ణ‌మూర్తి కొన్ని సంద‌ర్భాల్లో గ‌ళం విప్పుతుంటారు. అలాంటి ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. డ్ర‌గ్స్ కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సినీ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్స్ తో లింకులు ఉంటున్నాయ‌న్న సందేహాలు అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. డ్ర‌గ్స్ కేసు విచార‌ణ విష‌యంలో సిట్ అధికారులు.. మీడియా అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు.

ఇప్పుడా జాబితాలో సినీ కామ్రేడ్ నారాయ‌ణ‌మూర్తి కూడా చేర‌టం విశేషం. డ్ర‌గ్స్ కేసులో కేవ‌లం సినిమా రంగాన్నే టార్గెట్ చేయ‌టం స‌రికాద‌ని ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. సిట్ అధికారులు.. మీడియా క‌లిసి సినిమాలు తీసే వాళ్ల‌కే సినిమాలు చూపిస్తున్నారంటూ వ్యాఖ్య‌లు చేయ‌టం విశేషం. తాజా ఉదంతంలో సినిమా వాళ్లు మాత్ర‌మే డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లుగా భ్ర‌మ‌లు క‌ల్పిస్తున్నార‌ని.. పెద్ద పెద్ద కంపెనీల‌కు చెందిన ఉద్యోగులు.. రాజ‌కీయ నేత‌లు.. వ్యాపార‌వేత్త‌లు కూడా డ్ర‌గ్స్ వాడుతున్నార‌న్నారు. వాళ్లంద‌రిని వ‌దిలేసి.. సినిమా వాళ్ల మీద‌నే ఫోక‌స్ చేయ‌టం స‌రికాద‌న్నారు.

దేశంలో 1960 నుంచి డ్ర‌గ్స్ వాడ‌కం ఉంద‌ని.. దీన్ని అరిక‌ట్టాల్సిన బాధ్య‌త కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాల మీద ఉంద‌న్న ఆయ‌న‌.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఓవైపు సిగిరెట్.. మ‌ద్యం సీసాల మీద ఆరోగ్యానికి హానిక‌రం అంటూనే ఆదాయం కోసం ప్ర‌భుత్వాలు వాటిని ప్రోత్స‌హిస్తున్నాయ‌న్నారు. డ్ర‌గ్స్‌ కు స్కూల్ పిల్ల‌లు కూడా బానిస‌లు కావ‌టం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ కేసులో మూలాలు వెతికి అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న నారాయ‌ణ మూర్తి.. పోలీసులు.. మీడియా మీద ప‌డే క‌న్నా.. మూలాల్ని క‌నుగొనేందుకు సాయం చేయొచ్చుగా..?

సిగిరెట్‌.. మ‌ద్యం అమ్మ‌కాల్ని ప్ర‌శ్నిస్తున్న నారాయ‌ణ‌మూర్తి.. డ్ర‌గ్స్ విష‌యంలో త‌న వైఖ‌రిని మ‌రింత స్ప‌ష్టం చేస్తే బాగుంటుందేమో?