‘మెహబూబా’ మీట్ లో జై బాలయ్య

Wed May 16 2018 13:06:22 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ.. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే వీళ్ల శైలి భిన్నంగా ఉంటుంది. వీళ్లకు సింక్ అయి ఓ సినిమా చేస్తారన్న అంచనాలే లేకపోయేవి. కానీ అనూహ్యంగా గత ఏడాది ఇద్దరూ కలిసి ‘పైసా వసూల్’ చేశారు. పూరి వరుస ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో బాలయ్య అతడికి ఛాన్సిచ్చాడు. కానీ ఈ అవకాశాన్ని పూరి సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తనకు అలవాటైన రీతిలోనే మాఫియా కథతో రొటీన్ సినిమా తీసి నిరాశ కలిగించాడు. ఐతే బాలయ్యను మాత్రం కొంచెం కొత్తగా చూపించాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాబట్టే సినిమా ఫ్లాపైనా ఈ విషయంలో బాలయ్య కొంచెం సంతృప్తితోనే ఉన్నాడేమో. అందుకే పూరితో ఆ తర్వాత కూడా సంబంధాలు కొనసాగిస్తున్నట్లున్నాడు.తన కొత్త సినిమా ‘మెహబూబా’ థ్యాంక్స్ మీట్లో పూరి.. బాలయ్య ప్రస్తావన తేవడం విశేషం. ఈ చిత్రానికి ఆడియో వేడుక కూడా చేయలేదని.. కాబట్టి ఎవరికీ థ్యాంక్స్ చెప్పే అవకాశం రాలేదని.. ఈ సందర్భంగా తాను బాలయ్యకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని పూరి చెప్పాడు. ఈ సినిమా చేస్తున్నపుడు బాలయ్య ఎప్పటికప్పుడు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడని.. సినిమా బాగా తీస్తున్నావా అని అడిగాడని.. ఆకాశ్ పట్ల ఆసక్తి చూపించారని.. ఫ్రెండ్షిప్ కు ఆయన ఇచ్చే విలువ అదని.. ఇలాంటి వ్యక్తిని తానెక్కడా చూడలేదని పూరి అన్నాడు. అంతా అయ్యాక ‘జై బాలయ్యా’ అనే నినాదాలతో పూరి తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. ‘మెహబూబా’కు సంబంధించిన కార్యక్రమంలో పూరి ఇలా జై బాలయ్య నినాదాలు చేయడం ఆశ్చర్యపరిచింది. నిజానికి ‘పైసా వసూల్’ తర్వాత పూరితో బాలయ్య మరో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. పూరి తాజా వ్యాఖ్యల్ని బట్టి చూస్తే వీరి మధ్య అనుబంధం కొనసాగుతోందని.. మళ్లీ ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చినా ఆశ్చర్యం లేదని అనిపిస్తోంది.