పూరి ఏది ఫ్యూచర్ దారి?

Sat Aug 11 2018 07:00:26 GMT+0530 (IST)

సరిగ్గా ఓ 12 ఏళ్ళు వెనక్కు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే దర్శకుడు పూరి జగన్నాధ్ చేసిన పోకిరి మహేష్ బాబు ఇమేజ్ నే కాదు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలను సమూలంగా మార్చేసింది. దెబ్బకు పూరి డిమాండ్ అమాంతం ఎగబాకింది. హీరోలు పోటీ పడి మరీ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఏది చేయాలో ఏది వద్దనాలో అర్థం కానీ అయోమయంలో పూరి అంతకు ముందు ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ భారీగా ఇచ్చాడు. రామ్ చరణ్ తేజ్ ని పర్ఫెక్ట్ డెబ్యూ ద్వారా పరిచయం చేసాడు. ఇదంతా గత  చరిత్ర. వర్తమానానికి వస్తే పూరి టైం ఇంచు కూడా బాలేదు. వరసగా అందివచ్చిన ఏ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేదు. కొడుకుని హీరోగా పెట్టి భారీ బడ్జెట్ తో మెహబూబా తీస్తే అది వచ్చిందనే విషయం ప్రేక్షకులు గుర్తించేలోపే మాయమైపోయింది. అంతకు ముందు బాలకృష్ణ కోరి మరీ పైసా వసూల్ ఆఫర్ ఇస్తే పోకిరి కథనే తిప్పి రాసుకుని కనీసం అభిమానులను సైతం మెప్పించలేకపోయాడు. బాలయ్యను కాస్త కొత్తగా చూపించాడు అనే కామెంట్ తప్ప ఒరిగింది శూన్యం.ఇప్పుడు పూరి నెక్స్ట్ మూవీ ఏంటి  అనేదే భేతాళ ప్రశ్నగా మారింది. మెహబూబాకు బాగానే చేతులు కాలినట్టు విడుదలైన టైంలోనే టాక్ వచ్చింది. దాని తర్వాత కూడా ఆకాష్ పూరి తోనే చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు పూరి. కానీ ఇప్పుడు వాతావరణం అందుకు అనుకూలంగా లేదు. తన పేరుని నమ్మి సినిమాను కొనే సాహసం చేసేందుకు ట్రేడ్  సిద్ధంగా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు కాస్త పేరున్న హీరోతో ఏదైనా హిట్ కొడితే బయటపడే అవకాశం ఉంది. ఆకాష్ పూరితో తీస్తే ఓపెనింగ్స్ కూడా అనుమానమే. పైసా వసూల్ టైంలో బాలయ్య మరో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు కానీ ఇప్పుడు అది కూడా కార్య రూపం దాల్చడం అనుమానంగానే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ అయ్యేలోపే  వివి వినాయక్ ని లైన్ లో పెట్టిన బాలయ్య ఆ తర్వాత బోయపాటి శీనుతో కూడా కమిట్మెంట్ తీసుకున్నట్టు ఇప్పటికీ టాక్ ఉంది. సో పూరి తరువాతి  సినిమా ఎవరితో ఉంటుందనేది  ప్రస్తుతానికి సస్పెన్స్. టైం అంటే ఇంతే మరి. ఒకప్పుడు మనకోసం  కాల్ వెయిటింగ్ లో ఉన్నవాళ్లు మనమే  కాల్ చేసినా కట్ చేసే పరిస్థితి తెప్పిస్తుంది. పూరిని కమ్మిన ఈ నీలి నీడలు ఎప్పుడు తొలగేనో.