Begin typing your search above and press return to search.

జిల్లా పునాది వేస్తే.. పులి దంచుకున్నాడు

By:  Tupaki Desk   |   4 Aug 2015 7:48 PM GMT
జిల్లా పునాది వేస్తే.. పులి దంచుకున్నాడు
X
తమిళనాట తన ఫాలోయింగ్ ముందు బచ్చాలనుకునే హీరోలందరూ తెలుగులో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటే విజయ్ ఎంత ఫీలై ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే తెలుగులో మార్కెట్ తెచ్చుకోవడానికి చాన్నాళ్ల నుంచి దండయాత్రలు చేశాడు విజయ్. విజయ్ ని మన ప్రేక్షకులు ఆమోదించడానికి చాలా టైం పట్టింది. త్రీ ఇడియట్స్ రీమేక్ స్నేహితుడు సినిమాతో తొలిసారి అంతో ఇంతో ప్రభావం చూపించాడు విజయ్. ఆ తర్వాత తుపాకి ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు జిల్లా ఇళయ దళపతికి టాలీవుడ్ మార్కెట్లో బాగానే పునాది వేసింది. పది రోజుల కిందట పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ‘జిల్లా’ అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టి ‘హిట్’ అనిపించుకుంది.

జిల్లా హిట్ విజయ్ కి సరైన టైంలో వచ్చిందని చెప్పాలి. విజయ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పులి’ సినిమాకు ఇది భలేగా కలిసొచ్చింది. ‘జిల్లా’ హిట్టయిన తర్వాత బిజినెస్ లెక్కలు మాట్లాడి ‘పులి’ నిర్మాత ఏకంగా ఎనిమిది కోట్లు జేబులో వేసుకున్నట్లు సమాచారం. విజయ్ మార్కెట్ ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద అమౌంట్. దాదాపుగా ఇది సూర్య మార్కెట్ రేంజ్ ని రీచ్ అవుతోంది. ఒకప్పుడు 15 కోట్ల దాకా మార్కెట్ ఉన్న సూర్య.. ఈ మధ్య పది కోట్ల లోపుకు పడిపోయాడు. పులి కనుక హిట్టయితే విజయ్ తెలుగులో పది కోట్ల హీరో అనిపించుకోవడం ఖాయం. సెప్టెంబరు 17న తమిళంతో పాటు తెలుగులోని ఒకేసారి ‘పులి’ని విడుదల చేయబోతున్నారు. దాదాపు వెయ్యి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయాలన్నది ప్లాన్ అట. అదే నిజమైతే సినిమాకు మంచి టాక్ రావాలే కానీ.. విజయ్ రేంజే మారిపోతుందేమో.