Begin typing your search above and press return to search.

బాహుబలిని చూసి భయపడుతున్నట్లేగా!

By:  Tupaki Desk   |   31 July 2015 1:53 AM GMT
బాహుబలిని చూసి భయపడుతున్నట్లేగా!
X
బాహుబలి కంటే ముందు రుద్రమదేవిని విడుదల చేయాలని విశ్వ ప్రయత్నం చేశాడు గుణశేఖర్. బాహుబలి విడుదలయ్యాక దాంతో పోలిక వస్తుందన్న భయమే ఇందుకు కారణం. కానీ గుణశేఖర్ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడతను తన సినిమా విజువల్ ఎఫెక్టుల కోసం, భారీతనం కోసం తీసింది కాదని చెప్పడం ద్వారా బాహుబలితో పోలిక పెట్టొద్దని చెప్పకనే చెబుతున్నాడు. ఈ మాటలో సెటైర్ ఉంది. కొంత ఆందోళనా కనిపిస్తోంది. ఐతే ఇక్కడ ‘రుద్రమదేవి’కి మాత్రమే కాదు.. తమిళనాట ‘పులి’ సినిమాకు కూడా బాహుబలి భయం పట్టుకుంది. బాహుబలి రాక ముందు వరకు ఆ సినిమా నిర్మాతలకు అలాంటి కంగారేమీ లేదు. రోబో, ఐ సినిమాల స్థాయిలో తమిళ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ చిత్రాల్లో తమది ఒకటవుతుందని ఆశాభావంతో ఉన్నారు. బాహుబలి వచ్చినా తమిళంలో పెద్దగా ప్రభావం ఉండదనుకున్నారు. కానీ ఆ సినిమా తమిళనాట చరిత్రాత్మక వసూళ్లు సాధించింది. దీంతో ‘పులి’ టీంలో కంగారు మొదలైంది.

నిన్న పులి ఫస్ట్ ప్రెస్ మీట్ లో బాహుబలి ప్రస్తావన తేవడం ద్వారా వారి భయాన్ని బయటపెట్టేసుకున్నారు. బాహుబలి సినిమాతో పులికి పోలిక పెట్టవద్దని.. ఇదొక విభిన్నమైన సినిమా అని.. మాస్ ఎంటర్టైనర్ అని చెప్పాడు నిర్మాత. ‘పులి’ నేపథ్యమే వేరని.. తమిళ ప్రేక్షకులు ఇప్పటిదాకా చూడని భారీతనం ఇందులో ఉంటుందని అంటున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే.. ఇదే కార్యక్రమంలో శ్రీదేవి ప్రస్తావన తెస్తూ.. ఆమె మరో సౌత్ ఇండియన్ మూవీలో చేయమంటే ఒప్పుకోలేదని.. కానీ ‘పులి’ సినిమా కథ, తన పాత్ర బాగా నచ్చి ఒప్పుకున్నారని చెప్పాడు డైరెక్టర్. శ్రీదేవి తిరస్కరించిన సినిమా బాహుబలి అన్న సంగతి తెలిసిందే. ఈ మాట చెప్పడం ద్వారా బాహుబలి కంటే పులి కథ గొప్పగా ఉంటుందని చెబుతున్నారన్నమాట. అంత గొప్పదనం ఏముందో ఇంకో నెలన్నరలో తేలిపోతుందిగా.. చూద్దాం!