ఓరి మీ పబ్లిక్ టాక్ ఏషాలో!!

Sat Aug 12 2017 06:00:01 GMT+0530 (IST)

కొత్తగా ఒక సినిమా రిలీజైందంటే చాలు.. వెంటనే టివి అండ్ వెబ్ చానళ్ళు మైకులు పట్టుకుని ధియేటర్ల బయట రెడీ అయిపోతున్నారు. కొన్ని ప్రముఖ ధియేటర్ల దగ్గర నుంచుని.. జనాల మొహంలో మైకు పెట్టి.. టాక్ చెప్పండి అంటుంటారు. ఒక రకంగా ఇలా చేయడం కారణంగా జెన్యూన్ గా పబ్లిక్ టాక్ ఏంటనేది తెలిసే ఛాన్సుంది. కాని ఇప్పడు ఆ అవకాశాలపై చాలామంది గండి కొట్టేస్తున్నారు.

మీరు కనుక కొన్ని పాపులర్ పబ్లిక్ టాక్ వీడియోలు ఏవైనా చూసినట్లయితే.. అందులో ఎక్కువసార్లు కనిపించేవి సినిమా సెలబ్రిటీల ఫేసులే. మనోళ్ళు మైకులు ముందుకొచ్చి.. సినిమా అలా ఉంది ఇలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆల్రెడీ సినిమా ఇండస్ర్టీలో ఉన్న వారు.. ఖచ్చితంగా సినిమా బాగోలేకపోయినా కూడా ఆ విషయం చెప్పలేరు. అలాంటప్పుడు మైకు ముందుకొచ్చి డప్పు ఎందుకు? వీరు ప్రతీ శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఉదయం 8.45 ఆటకు వెళిపోయి.. బయటకు వస్తూ మైకుల ముందు హడావుడి చేయడం నిజమైన టాక్ ను తొక్కేయడమే. వీళ్ళే కాదు.. ఎలాగో మైక్ పెడతారు కాబట్టి.. అక్కడ కొంతమంది రొటీన్ గా ఒక బ్యాచ్ తయారయ్యారు. వీళ్లకు ఈ టాక్ చెప్పడం తప్పించి ప్రత్యేకంగా పనేం ఉండదు. అలా టివిల్లో వెబ్ వీడియోల్లో ముఖం కనబడుతుందని వీరి ఆనందం అంతే.

కాని సినిమా గురించి చెప్పండర్రా అంటే వీరి పైత్యం పైశాచికత్వం కలిపి ఏదేదో మైకు ముందు ఊదేస్తున్నారు. ఏదో నాలుగు మాటలు కొత్తగా ఉన్నవి వేసుకోవాలి కాబట్టి.. ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తూ మీడియాలు కూడా వారి మాటలనే పబ్లిక్ టాక్ అన్నట్లు చెబుతున్నారు. ఇదంతా చూస్తున్న నిజమైన సినిమా లవ్వర్లు మాత్రం.. ఓరి మీ పబ్లిక్ టాక్ ఏషాలో అంటూ నవ్వుకుంటున్నారు.