ఆ సీన్ కోసమా అంతగా ఫీలయ్యాడు?

Wed Jan 11 2017 18:16:18 GMT+0530 (IST)

‘ఖైదీ నెంబర్ 150’కి సంబంధించి విడుదలకు ముందు ఓ చిన్న వివాదం వార్తల్లో నిలిచింది. సినిమాలో కమెడియన్ పృథ్వీకి సంబంధించిన సన్నివేశాల్లో కోత పెట్టడంపై మీడియాలో వార్తలు రావడం.. దానిపై అతను స్పందిస్తూ సంక్రాంతి రోజు తన తల్లి చనిపోయినంత బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేయడం.. ఈ సంగతి చిరు వరకు చేరి.. పృథ్వీకి సంబంధించిన సీన్స్ అలాగే ఉంచేయాలని దర్శకుడు వినాయక్ కు చెప్పడం.. మొత్తానికి కథ సుఖాంతమవడం.. ఇలా నడిచింది వ్యవహారం. మీడియాలో ఈ వ్యవహారంపై చాలా చర్చ నడవడంతో అసలా సన్నివేశంలో ఏముందో చూద్దామని అందరూ వెయిట్ చేశారు.

ఐతే సినిమాలో పృథ్వీకి సంబంధించిన సన్నివేశం చూస్తే మాత్రం దీనికా అతను అంతగా ఆవేదన చెందాడు అనిపించచడం ఖాయం. కేవలం ఒకే ఒక్క నిమిషంలో ముగిసిపోయే సన్నివేశం అది. రైతుల సమస్య పరిష్కరించడం కోసం వాళ్లందరినీ వెంటేసుకుని మంత్రి గారింటికి వెళ్తాడు చిరు. ఆ మంత్రిగారి పాత్రను పృథ్వీ పోషించాడు. స్విమ్మింగ్ పూల్ లో మునిగి తేలుతున్న మంత్రి.. మీ సమస్యేంటో చెప్పమంటాడు. సమస్య చెప్పాక ఓ మునుగు మునిగి మీ సమస్యపై డీప్ గా ఆలోచించా. సాల్వ్ చేయలేం అంటారు. దీంతో చిరు ఒక సెటైర్ వేసి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. అంతే.. ఆ తర్వాత పృథ్వీ కనిపించడు. ఐతే నిడివి తక్కువే అయినప్పటికీ చిరంజీవి ల్యాండ్ మార్క్ సినిమాలో తాను నిమిషం కనిపించినా గొప్పే అనుకున్నట్లున్నాడు పృథ్వీ. అందుకే అంతగా ఆవేదన చెందినట్లున్నాడు. మొత్తానికి అతను కోరుకున్నట్లు చిరు 150 సినిమాలో కనిపించాడు కాబట్టి సమస్య తీరిపోయినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/