ప్రమోషన్ లేకపోతే.. అంతేగా అంతేగా!!

Fri Jan 11 2019 14:39:11 GMT+0530 (IST)

సంక్రాంతి బరిలో ఒక్కో సినిమా వరుసగా రిలీజవుతున్నాయి. జనవరి 9న కథానాయకుడు - జనవరి 10న పేట - జనవరి 11న వినయ విధేయ రామ వరుసగా బరిలో దిగిపోయాయి. అసలు ఈ సినిమాల రిజల్ట్ మాటేమిటి? అంటే.. ఫలితం గురించి ఒక్కో వర్గం ఒక్కోలా మాట్లాడుతోంది. ఫ్యాన్స్ బావుంది అని జబ్బలు చరిచేస్తుంటే - అసలేమీ బాలేదని యాంటీ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. కామన్ ఆడియెన్ మాత్రం టోటల్ గా పెదవి విరిచేస్తున్నారు. విరుపులు అరుపులు తప్ప గొప్పగా ఉందిలే అన్నవాళ్లే కనిపించలేదాయె!దీనికి తోడు సంక్రాంతి సినిమాలకు సరైన ప్రమోషన్ లేకపోవడం కూడా ఓ పెద్ద మైనస్. కథానాయకుడు చిత్రం బావుందని టాక్ వినిపించినా ప్రచారంలో పిసినారితనం బెడిసికొట్టేసింది. సరైన ప్రమోషన్స్ లేక ఫ్యాన్స్ వరకే పరిమితమైంది ఈ చిత్రం. దీంతో జనాల్ని థియేటర్లకు తీసుకెళ్లడంలో విఫలమవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పేట చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఆ సినిమాకి సరైన ప్రచారం లేకపోవడం తేడా కొట్టిందని సీన్ చెబుతోంది. ఈ సినిమాలో రజనీ పాత అవతారంలోకి మారిపోయారని అతడి నటన బావుందని అంటున్నా రొటీన్ కథ.. అందుకు తగ్గట్టే ప్రచారం లేకపోవడంతో థియేటర్లకు ఎవరూ వెళ్లని పరిస్థితి.

నేడు రిలీజైన `వినయ విధేయ రామ` చిత్రానికి ప్రమోషన్ ఫర్వాలేదు. కానీ జనంలో మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. చరణ్ ఫ్యాన్స్ ఒకలా ఉంటే - యాంటీ ఫ్యాన్స్ మాట ఇంకోలా ఉంది. మొత్తానికి ఈ సంక్రాంతి బరిలో మిగిలింది ఒకే ఒక్క సినిమా. ఆ ఒక్కటీ అయినా హిట్టు కొడుతుందా? అంటూ ముచ్చట మొదలైంది. అయితే జనవరి 12న వస్తున్న ఎఫ్ 2 చిత్రానికి అస్సలు ప్రమోషన్ లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.  పూర్ ప్రమోషన్ పూర్ రిజల్ట్ అని పరిశ్రమలో పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ఎఫ్ 2 సన్నివేశం అదే. అంతేగా అంతేగా అని వెంకీ - వరుణ్ అన్నారు కానీ రిజల్ట్ విషయంలోనూ అంతేగా అనకుండా ఉండాలంటే ప్రమోషన్ లో వేగం పెంచాల్సి ఉంటుంది. ఇతర సినిమాల రిజల్ట్ ఏంటో ఇప్పటికే వీళ్లకు చేరువైంది కాబట్టి ఇదే అదనుగా ప్రమోషన్స్ పరంగా వేగం పెంచుతారేమో చూడాలి. ఇక బావుంది అన్న టాక్ వచ్చీ ప్రమోషన్ లేక వెనకబడిన కథానాయకుడు ఇతర సినిమాలకు థ్రెట్ గా మారే సన్నివేశం లేకపోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమాకి సరైన పబ్లిసిటీ చేస్తారేమో చూడాలి.