Begin typing your search above and press return to search.

మార్కెట్‌: అదుకున్న‌ది అభిమ‌న్యుడొక్క‌డే

By:  Tupaki Desk   |   15 July 2018 5:22 PM GMT
మార్కెట్‌: అదుకున్న‌ది అభిమ‌న్యుడొక్క‌డే
X
తెలుగు ప్రేక్ష‌కుల‌ది విశాల హృద‌యం అంటారు. సినిమా బాగుందంటే అది డ‌బ్బింగా - మ‌రొక‌టా అని ప‌ట్టించుకోరు. అందులో తెలిసిన స్టార్లు ఉన్నా లేక‌పోయినా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటారు. వ‌సూళ్ల‌తో ముంచెత్తుతుంటారు. అందుకే తెలుగు తెర‌పైకి వెల్లువ‌లా వ‌స్తుంటాయి డ‌బ్బింగ్ సినిమాలు. ముఖ్యంగా పొరుగు భాష త‌మిళం నుంచి ఎక్కువ చిత్రాలు అనువాదాలుగా వ‌స్తుంటాయి. దాదాపు అక్క‌డి అగ్ర క‌థానాయ‌కులంతా తెలుగులో త‌మ సినిమాల్ని క్ర‌మం త‌ప్ప‌కుండా విడుద‌ల చేస్తుంటారు. వాళ్ల‌కంటూ తెలుగులో ఒక మార్కెట్ ఏర్ప‌డిందంటే కార‌ణం అదే. కొన్ని సినిమాల‌కి త‌మిళంలో ఎన్ని వ‌సూళ్లొస్తుంటాయో - అనువాదంగా విడుద‌లైనా తెలుగు నుంచి కూడా అదే స్థాయిలో కాసులు కురుస్తుంటాయి. ఒక‌ప్పుడు తెలుగులో అనువాదాల‌దే హ‌వా అన్న‌ట్టుండేది వాతావ‌ర‌ణం.

అయితే కొన్నేళ్లుగా ఆ జోరు బాగా త‌గ్గింది. ఈ యేడాది కూడా త‌మిళ సినిమాలు ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్ - విక్ర‌మ్ మొద‌లుకొని ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల సినిమాలు దాదాపుగా 30 వ‌ర‌కు తెలుగులో డ‌బ్బింగ్ అయ్యాయి. వాటిలో ఒక‌ట్రెండు సినిమాలు మిన‌హా మిగ‌తావి తెలుగు బాక్సాఫీసుపై ఏమాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. ర‌జ‌నీ `కాలా` చాలా అంచ‌నాల‌తో విడుద‌లైంది. కానీ ఆ సినిమా ఎలా వ‌చ్చిందో - ఎలా వెళ్లిందో అర్థం కాని ప‌రిస్థితి. అలాగే విక్ర‌మ్ వేసిన స్కెచ్ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌భుదేవా గులేబ‌కావ‌లి - విజ‌య్ ఆంటోనీ కాశీ సినిమాలొచ్చాయి. విజ‌య్ ఆంటోనీ బిచ్చ‌గాడుతో తెలుగులో సంచ‌ల‌నమే సృష్టించాడు. ఆ త‌ర్వాత మాత్రం ఆయ‌న సినిమాలు మ‌ళ్లీ అలాంటి మేజ‌క్‌ ని రిపీట్ చేయ‌లేక‌పోయాయి. సూర్య `గ్యాంగ్‌` సంక్రాంతి సంద‌డిలో విడుద‌లైంది కాబ‌ట్టి ఒక మాదిరి వ‌సూళ్లొచ్చాయి. విశాల్ అభిమ‌న్యుడు మాత్రం అద‌ర‌గొట్టాడు. సోష‌ల్ మీడియా నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం కావ‌డంతో త‌మిళంలోలాగే తెలుగులోనూ మంచి రెస్సాన్స్ ల‌భించింది. కార్తి `చిన్న‌బాబు ` ఈమ‌ధ్యే విడుద‌లైంది. బీ - సీ సెంట‌ర్ల‌లో సినిమాకి మంచి టాకే ఉంది. మ‌రి బాక్సాఫీసు ద‌గ్గ‌ర స్ట‌డీగా ఎంత కాలం నిల‌బ‌డుతుంది, ఎన్ని వ‌సూళ్లు సాధిస్తుంద‌నేది చూడాలి. జ‌యం ర‌వి న‌టించిన `టిక్ టిక్ టిక్‌` - న‌య‌న‌తార క‌ర్త‌వ్యం సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందినా బాక్స‌ఫీసు ద‌గ్గ‌ర మాత్రం నిల‌బ‌డ‌లేక‌పోయాయి. హిందీ నుంచి `ప‌ద్మావ‌త్‌`లాంటి సినిమా కూడా తెలుగులో అనువాద‌మైంది. కానీ ఆ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా న‌చ్చ‌లేదు. ఆంగ్ల చిత్రాల్లో `ఎవెంజ‌ర్స్ ఇన్ఫినిటీ వార్` మాత్రం మ‌ల్టీప్లెక్స్‌ల్లో కాస్త సంద‌డి చేసింది. ఓవ‌రాల్‌గా చూస్తే డ‌బ్బింగ్ మార్కెట్ క‌ళ త‌ప్పింద‌న్న‌ది సుస్ప‌ష్టం. కొన్నిసినిమాలు ప‌బ్లిసిటీకి పెట్టిన ఖ‌ర్చును కూడా రాబ‌ట్ట‌లేక‌పోయాయి. ఇప్పుడు అంద‌రి చూపూ ర‌జ‌నీ 2.0పై ఉంది. ఆ చిత్రం అంచ‌నాలకి త‌గ్గ‌ట్టుగా ఆడితే మ‌ళ్లీ డ‌బ్బింగ్ మార్కెట్టు పుంజుకొనే అవ‌కాశం ఉంది.