Begin typing your search above and press return to search.

వంశీ సినిమాకు ప్రాణం పోసింది అతనే..

By:  Tupaki Desk   |   22 May 2017 11:11 AM GMT
వంశీ సినిమాకు ప్రాణం పోసింది అతనే..
X
సీనియర్ దర్శకుడు వంశీ ఒక దశలో ఆరేళ్ల పాటు సినిమానే చేయలేదు. ఆ గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్టయింది. అది చూసి వంశీ అభిమానుల్లో ప్రాణం లేచి వచ్చింది. అన్నేళ్ల పాటు మిస్సయిన వంశీ మళ్లీ వచ్చేశాడని.. ఇక వరుసగా మంచి మంచి సినిమాలు ఆయన నుంచి వస్తాయని ఆశించారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికి ‘ఔను..’ మాత్రమే మిగిలింది వంశీ. దాని తర్వాత తీసిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటీ ఆడలేదు. అందులోనూ గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చివరగా ఆయన తీసిన ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు.

ఇలాంటి పరిస్థితుల్లో వంశీ ‘లేడీస్ టైలర్’ సీక్వెల్ కోసం సన్నాహాలు చేస్తున్నాడనగానే ఆయన అభిమానులకు కూడా పెద్ద ఆసక్తేమీ కలగలేదు. వంశీ ఫామ్ చూసి రాజ్ తరుణ్ లాంటి అప్ కమింగ్ హీరో కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ట్రేడ్ వర్గాల్లోనూ అంతగా ఆసక్తి కనిపించకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కడం కష్టమే అనుకున్నారు. అలాంటిది ఈ సినిమా మొదలవడమే కాదు.. విజయవంతంగా పూర్తయింది. జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. మంచి అంచనాల మధ్య జూన్ 2న ఈ సినిమా విడుదలకు సిద్ధం కూడా అవుతోంది. ఈ విషయంలో మేజర్ క్రెడిట్ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికే ఇవ్వాలి. దర్శకుడిగా ఒక్క ‘స్నేహగీతం’ మినహా మధుర శ్రీధర్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కానీ.. నిర్మాతగా మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడాయన. ఈ ట్రెండుకు తగ్గట్లుగా సినిమాను ప్రమోట్ చేయడంలో.. మార్కెట్ చేయడంలో మధుర శ్రీధర్ ఆరితేరాడు. అందుకే ఆయన బేనర్లో మరీ ఎక్కువ నష్టాలు తెచ్చిన సినిమాలేమీ లేవు.

మధుర శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’తో పాటు ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’కు మంచి టాక్ ఏమీ రాకపోయినా.. వాటికి పెట్టుబడి మాత్రం వెనక్కి వచ్చింది. వాటిని బాగా ప్రమోట్ చేసి ఓపెనింగ్స్ వచ్చేలా చూడటమే దీనికి కారణం. కొణిదెల నీహారిక కథానాయికగా పరిచయమైన ‘ఒక మనసు’ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నా.. తన మార్కెటింగ్ ప్రతిభతో దాని మీద కూడా క్యూరియాసిటీ తేగలిగాడు. ఇక ‘ఫ్యాషన్ డిజైనర్’ విషయంలో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయడం దగ్గర్నుంచి దీనిపై చర్చ నడిచేలా చేయగలిగాడు. ఆ తర్వాత కుర్రాళ్లకు కిక్కిచ్చే విజువల్స్ తో ఒక్కో పాట రిలీజ్ చేస్తూ కొనసాగేలా చేశాడు. టీజర్.. ట్రైలర్ కూడా జనాల్ని ఆకర్షించగలిగాయి. వీటిలో వంశీ పాత్ర నామమాత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ప్రోమోలతో జనాల్ని ఆకర్షించడంలో ఎంత ఆరితేరినా.. సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు చూస్తారన్న సంగతి మధుర శ్రీధర్ కు తెలియంది కాదు. గత కొన్నేళ్లలో ఔట్ డేటెడ్ సినిమాలతో విసిగించిన వంశీ.. ‘ఫ్యాషన్ డిజైనర్’తో ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి. సినిమాలో కంటెంట్ లేకపోతే జస్ట్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.