ఓర్నీ.. హీరోయిన్ల మీద పడుతున్నారే!

Sun Jul 16 2017 14:00:48 GMT+0530 (IST)

చెడిపోయేవాడిని ఎవరూ ప్రత్యేకంగా చెడగొట్టాల్సిన అవసరం లేదు. బాగుపడేవాడిని ప్రత్యేకించి బాగుపడేలా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎవరికేం కావాలో.. ఎవరేం కోరుకుంటారో వారికది దక్కుతుందనటంలో సందేహం లేదు. అయితే.. అందుకు బలమైన ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది.

టాలీవుడ్ ను.. రెండు తెలుగు రాష్ట్రాల్ని ఊపేస్తున్న డ్రగ్స్ కేసు ఉదంతంపై సినీ రంగానికి చెందిన కొందరి మాటలు ఇప్పుడు కొత్తగా.. సరికొత్తగా ఉండటం గమనార్హం. డ్రగ్స్ ను వినియోగిస్తున్నారన్న మచ్చను నోటీసుల రూపంలో వేయించుకున్న కొందరు.. ఇప్పుడు తమపై పడిన మచ్చను పోగొట్టుకునేందుకు కిందామీదా పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వ్యవహారంపై మరికొందరు చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయి.

సినీ నటుడు.. నిర్మాత కొల్లా అశోక్ కుమర్ మాటల్నే చూస్తే.. డ్రగ్స్ కల్చర్ గతంలో హైదరాబాద్ లో అస్సలు కనిపించలేదన్నారు. అయితే.. నార్త్ నుంచి హీరోయిన్లు రావటం మొదలైన తర్వాతనే కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ రాష్ట్రానికి దిగుమతి అయ్యిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

అశోక్ కుమార్ మాటలు వింటే.. సినీ రంగానికి చెందిన కొందరు డ్రగ్స్‌కు అలవాటు పడటానికి నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లే అన్న అర్థం వచ్చేలా మాట్లాడటం గమనార్హం. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు ఏ మాత్రం సరికావన్న మాట వినిపిస్తోంది. వేరే ప్రాంతం నుంచి వచ్చే హీరోయిన్ల కారణంగా మిగిలిన సినీ నటులు చెడిపోతున్నరన్నట్లుగా చెప్పే మాటలు అర్థం లేనివి.

ఇప్పుడున్న సినీ పరిశ్రమలోనే చూస్తే.. కొందరి మీద డ్రగ్స్ ఆరోపణలు వస్తే.. మరికొందరి మీద అలాంటివేమీ లేవన్నది కనిపిస్తుంది. కొందరు చెడిపోయిన దానిని.. నార్త్ హీరోయిన్ల పేరుతో తప్పు పట్టటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివి ప్రాంతాల మధ్య సరికొత్త అపోహలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.