బాహుబలి-2.. ప్రమోషన్ ఎందుకు?

Fri Apr 21 2017 15:21:30 GMT+0530 (IST)

విడుదలకు ముందు ‘బాహుబలి: ది బిగినింగ్’కు హైప్ మామూలుగా రాలేదు. అందుక్కారణం సినిమా మీద అప్పటికే జనాల్లో ఉన్న ఆసక్తితో తోడు ప్రమోషన్ పెద్ద స్థాయిలో చేయడం కూడా ఒక కారణమే. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ‘బాహుబలి’ని ప్రమోట్ చేసింది చిత్ర బృందం. ఇక విడుదలకు ముందు రాజమౌళి సహా యూనిట్లోని కీలక సభ్యులంతా మీడియాను కలిశారు. కొన్ని ప్రముఖ పత్రికలు ఫుల్ పేజీ ఇంటర్వ్యూలతో సినిమా పేజీల్ని నింపేశాయి. ఐతే అప్పటితో పోలిస్తే.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రమోషన్ గురించి జక్కన్న అండ్ కో అంతగా పట్టించుకుంటున్నట్లు లేదు. అప్పుడప్పుడూ ఒక పోస్టర్ రిలీజ్ చేయడం.. తెలుగు.. తమిళ ఆడియో వేడుకల్ని కొంచెం పెద్ద ఎత్తున చేయడం మినహాయిస్తే ప్రమోషన్ హడావుడి పెద్దగా కనిపించట్లేదు. ప్రభాస్.. కమల్ కణ్ణన్ లాంటి వాళ్లు మీడియాను కలవడం తప్పితే విడుదలకు వారం ఉండగా ఉండాల్సినంతగా ప్రమోషన్ జోరు కనిపించలేదు. రాజమౌళి.. మిగతా యూనిట్ సభ్యులు మీడియాను కలుస్తారో లేదో చూడాలి.

ఇప్పటికే ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద కావాల్సినంత హైప్ ఉంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే దేనికీ లేనంత హైప్ ఈ సినిమాకుంది. బాహుబలి బృందం ఏమీ మాట్లాడకున్నా.. ప్రత్యేకంగా ప్రమోషన్ ఏమీ చేయకున్నా.. కోట్లాది మంది థియేటర్లకు వచ్చేస్తారు. ప్రతి సినీ ప్రేక్షకుడూ ఈ సినిమాను చూడటం ఖాయం. అందుకేనేమో ప్రత్యేకంగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నట్లు లేదు. పైగా కర్ణాటక.. తమిళనాడుల్లో రిలీజ్ సమస్యలు.. పోస్ట్ ప్రొడక్షన్.. సెన్సార్ హడావుడి.. రిలీజ్ కోసం సన్నాహాలు.. వీటన్నింటిలో పడి రాజమౌళి టీంకు మీడియాను కలిసే తీరిక కూడా లేనట్లుంది. అయినా ‘బాహుబలి: ది కంక్లూజన్’కు వచ్చిన ఇబ్బందైతే ఏమీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/