వింక్ గర్ల్ సినిమా విడుదల అప్పుడే

Sat Dec 15 2018 23:00:01 GMT+0530 (IST)

ఒక కన్ను గీటే సీన్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించవచ్చని ప్రియా వారియర్ నిరూపించేవరకూ ఎవ్వరికీ తెలియదు.  'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళ చిత్రంలోని 'మాణిక్య మలరాయ పూవి' అనే పాటలో ప్రియా ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్.. అల్లరిగా కన్ను గీటడం ఆమెను సోషల్ మీడియా సెన్సేషన్ గా మార్చేశాయి. తాజగా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ లో 2018  కి గాను భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన పేరు ప్రియా వారియర్ దేనని కూడా తెలిసిందే.ఇదంతా ఓకే గానీ ప్రియ ను ఇంత పాపులర్ చేసి.. కోట్ల రూపాయల బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కాంట్రాక్టులు.. కొత్త కొత్త మూవీ ఆఫర్లు తీసుకొచ్చిన అసలు సినిమా 'ఒరు ఆదార్ లవ్' మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమా జూన్.. జులై నెలల్లోనే రిలీజ్ కావాలిసి ఉన్నప్పటికీ రిలీజ్ కాలేదు.  ప్రియాకు భారీ క్రేజ్ ఉంది కాబట్టి సినిమాకు మరింత ఎక్కువ బడ్జెట్ కేటాయించి రీషూట్ లు చేశారని.. ఇతర భాషలలో కూడా రిలీజ్ చేసేందుకు వీలుగా మార్పు చేర్పులు చేశారని సమాచారం. అందుకే సినిమా రిలేజ్ ఆలస్యం అయిందట. 

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.  ఈ సినిమాను మలయాళం తో పాటుగా తెలుగు.. తమిళ.. హిందీ భాషలలో ఒకేసారి రిలీజ్ చేస్తారట.