రియల్ రాణితో మన అందాల రాణి

Thu Sep 14 2017 12:39:19 GMT+0530 (IST)

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఇప్పుడు ప్రపంచం మొత్తం మెచ్చే అందాల రాణి అయిపోతోంది. హాలీవుడ్ లో పాగా వేసిన తర్వాత అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడీ అందాల రాణి నిజమైన రాణిని కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చింది. జోర్డాన్ క్వీన్ రానియాతో దిగిన ఫోటోను నెట్ లో షేర్ చేసింది ప్రియాంక చోప్రా.

యూనిసెఫ్ ప్రచారకర్త అయిన ప్రియాంక.. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పలు దేశాలలో ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు జోర్డాన్ దేశంలో పర్యటిస్తున్న ప్రియాంక.. తన విజిట్ లో భాగంగా జోర్డాన్ రాణిని కలిసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రియాంక.. మరోసారి రాణి రానియాను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని అంటోంది. పైగా అమ్మాన్ ప్రాంతంలోనే ఆమెను కలవడం బోలెడంత హ్యాపీగా ఉందట. అలాగే సిరియా శరణార్ధుల విషయంలో కింగ్డం ఆఫ్ జోర్డాన్ అందిస్తున్న సహాయాన్ని అవలంబిస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రశంసించింది ప్రియాంక.

రాణి రానియా స్ఫూర్తికి మారుపేరుగా నిలుస్తుందని.. చిన్నారుల విషయంలో ఆమె తీసుకునే జాగ్రత్తలు చాలా అప్రమత్తంగా ఉంటాయని చెప్పింది పీసీ. అందాల రాణి.. జోర్డాన్ రాణి కలిసి ఇచ్చిన పోజ్ మాత్రం సూపర్ గా ఉంది.