Begin typing your search above and press return to search.

'హార్వీ' లు ప్ర‌తి చోట ఉన్నారు: ప‌్రియాంక‌

By:  Tupaki Desk   |   21 Oct 2017 10:02 AM GMT
హార్వీ లు ప్ర‌తి చోట ఉన్నారు: ప‌్రియాంక‌
X
కొద్ది రోజులుగా ప్ర‌ముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ పేరు వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న నిర్మించిన చిత్రాల‌లోని హీరోయిన్ల‌తో హార్వీ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హార్వీ బాధితులంద‌రూ ఒక్కొక్క‌రుగా గ‌ళం విప్పుతూ అత‌డి నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెడుతున్నారు. హార్వీ ఉదంతం నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా వేధింపుల‌కు గురైన మ‌హిళ‌లు త‌మ అనుభ‌వాల‌ను పంచుకోవాలంటూ హ్యాష్ ట్యాగ్ మీ టూ అనే ఉద్య‌మం సోష‌ల్ మీడియాలో పెను దుమారం రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ పై ప్ర‌ముఖ న‌టి ప్రియాంకా చోప్రా న‌ర్మ గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసింది. హార్వీ వంటి వ్య‌క్తులు కేవ‌లం హాలీవుడ్ కే ప‌రిమితం కాద‌ని, చాలా చోట్ల హార్వీలున్నార‌ని ప్రియాంకా చోప్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఓ కార్యక్ర‌మం సంద‌ర్భంగా ప్రియాంక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

ఇండియాలో కూడా హార్వీ వంటి వ్య‌క్తులు చాలామంది ఉన్నార‌ని, ఆ మాట‌కొస్తే ప్ర‌తి చోట అటువంటి వ్య‌క్తులున్నార‌ని ప్రియాంక చెప్పింది. ఇది కేవ‌లం సెక్స్ కు సంబంధించిన అంశం కాద‌ని - ప‌ర‌ప‌తి - డ‌బ్బు - హోదా ల‌కు సంబంధించిన విష‌య‌మ‌ని తెలిపింది. సినిమా ఇండ‌స్ట్రీలో ఇటువంటి మ‌గ‌వాళ్లంద‌రూ ఒక జ‌ట్టుగా ఏర్ప‌డ‌తార‌ని, త‌మకు స‌హ‌క‌రించ‌క‌పోతే మ‌హిళ‌ల‌కు అవ‌కాశాలు రాకుండా చేస్తార‌ని పేర్కొంది. ఆ సంద‌ర్భాల్లో మ‌హిళ‌లు ఒంట‌రివారిగా మిగిలిపోతార‌ని చెప్పింది. ప్రియాంక నేరుగా బాలీవుడ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించ‌క‌పోయినా, ఆమె మాట‌లు బాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్ గురించేన‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా, ద‌క్షిణాది - ఉత్త‌రాది సినీ ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప‌లువురు హీరోయిన్లు బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే.