Begin typing your search above and press return to search.

రేప్ దారుణలపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   6 May 2016 5:43 AM GMT
రేప్ దారుణలపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్
X
రేప్ దురాగతాలపై ఒకప్పటి టాప్ హీరోయిన్ ప్రియమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐతే ఆమె ఆగ్రహం కరెక్టే కానీ.. ఈ క్రమంలో దేశం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ దేశాన్ని వదిలేసి వెళ్లిపోదాం అని ఆమె మహిళలకు పిలుపునివ్వడం వివాదాస్పదం అవుతోంది.

కేరళలో 30 ఏళ్ల లా స్టూడెంట్ జిషా అత్యాచారానికి గురై.. దారుణంగా హత్యకు గురైన ఘటనపై ప్రియమణి స్పందిస్తూ.. ‘‘ఆడవాళ్లను లైంగిక వేధింపులకు గురి చేసేవాళ్లను, అత్యాచారం చేసేవాళ్లను వదలకూడదు. అరబ్ దేశాల్లో ఇలాంటి దారుణాల పాల్పడితే కఠినంగా శిక్షిస్తారు. మన దేశంలో కూడా చట్టపరంగా కఠినమైన శిక్షలు విధించాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి. మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు. ఏ దేశంలో రక్షణగా ఉండగలుగుతామో అక్కడికి వెళ్లిపోవడం మంచిది. ఆడవాళ్లందరం దేశాన్ని వదిలేయడం మనకు శ్రేయస్కరం. మనం ఈ దేశంలో సురక్షితంగా బతకలేమనిపిస్తోంది. భారతదేశంలో మహిళల్ని దేవతలా భావించి పూజిస్తారని అంటారు. ఇలాంటి దేశంలో ఆడవాళ్లపై అత్యాచారం చేసి ఎలా చంపేయగలుగుతున్నారు? కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప నేరాలు ఆగవు’’ అని ప్రియమణి పేర్కొంది.

ఐతే రేప్ దురాగతాలపై మండిపడటం వరకు ఓకే. వారికి కఠిన శిక్షలు విధించాలనడమూ సబబే కానీ.. దేశాన్ని తిట్టడం.. మహిళలందరం దేశం విడిచి వెళ్లిపోదాం అంటూ ఇండియాను కించపరిచేలా మాట్లాడ్డంపై దుమారం చెలరేగింది. నువ్వు ఇన్నాళ్లుగా ఈ దేశంలో సురక్షితంగానే ఉన్నావ్ కదా.. నిన్ను అందరూ గౌరవించారు కదా.. అలాంటి దేశం గురించి ఇలామాట్లాడ్డం కరెక్టా అని ప్రియమణిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ట్విట్టర్ - ఫేస్ బుక్ లాంటి సామాజిక వేదికల్లో ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్లు కూడా వినిపించాయి. దీనిపై ప్రియమణి స్పందిస్తూ.. దేశంలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పడం కూడా తప్పేనా? నా అభిప్రాయాలను నిర్భయంగా చెప్పినందుకు నాపై యాంటి ఇండియన్ ముద్ర వేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆమె కోరింది.