Begin typing your search above and press return to search.

గుండె త‌రుక్కుపోయింద‌న్న దర్శి!

By:  Tupaki Desk   |   10 Jun 2019 3:07 PM GMT
గుండె త‌రుక్కుపోయింద‌న్న దర్శి!
X
ఆరో త‌ర‌గ‌తిలోనే చ‌దువు ఆపేశాడు. ప్ర‌యివేటుగా 10 పూర్తి చేసాడు. అమ్మ చీర‌లు నేస్తుంది. ఆమె రోజంతా ప‌ని చేస్తే కానీ ఒక చీర‌ను నేయ‌లేదు. నేత ప‌ని క‌ష్టం ఎంతో తెలిసిందే. అలాంటి క‌ష్టాల క‌డ‌లి నుంచి వ‌చ్చిన ఆ కుర్రాడు అమ్మ క‌న్నీరు తుడిచేందుకు ఓ యంత్రాన్ని క‌నిపెట్టాడు. హైద‌రాబాద్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ.. అత‌డు ఆవిష్క‌రించిన ఆ యంత్రం పేరు లక్ష్మీ ఆసుయంత్రం. అమ్మ పేరుమీదనే 2000లో లక్ష్మీ ఆసు యంత్రం కనిపెట్టాడు. 2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు తీసుకున్నాడు. ఆ యంత్రంతో త‌క్కువ స‌మ‌యంలో చీర‌ను నేసేయొచ్చు. ఈ యంత్రం ద్వారా రోజుకు ఆరేడు చీర‌లు నేయొచ్చు. ఆసియా బెస్ట్ యంత్రంగా దీనిని గుర్తించి దీనికోసం సాఫ్ట్ వేర్ ని రెడీ చేస్తామ‌ని అమెరికా ముందుకొచ్చింది. ఇది ఆసియాలోనే బెస్ట్ నేత యంత్రం అని కితాబిచ్చింది అమెరికా పాట్ ల్యాబ్స్. 2010 చివరిలో ఫోర్బ్స్ జాబితాలో అత‌డి పేరు చేరింది. 2011లో ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా పుర‌స్కారం అందుకుని అంద‌రి క‌ళ్ల‌లో ప‌డ్డాడు. త‌న‌దైన ప్ర‌తిభ‌తో నూతన ఆవిష్కరణలకు గాను ప్రధాని మోదీ చేతుల మీదుగా అమెజాన్ అవార్డు కూడా స్వీకరించాడు. ఇంత‌కీ అత‌డు ఎవ‌రు? అంటే పేరు చింత‌కింది మ‌ల్లేశం. ఆసు యంత్రం సృష్టి క‌ర్త‌. తెలంగాణ యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని శారాజీ పేటకు చెందిన నేతకారుడు చింతకింది మల్లేశం. నిరుపేద చేనేత కుటుంబం అతనిది. అత‌డి డిస్క‌వ‌రీ అస‌మానం. 800లకు పైగా ఆసు యంత్రాలను తయారుచేశారు ఇప్ప‌టికి. అందుకే అంత గుర్తింపు.

ప్ర‌స్తుతం మ‌ల్లేశం పేరుతోనే అత‌డి జీవితం వెండి తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ట్యాలెంటెడ్ క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. రాజ్.ఆర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌నే శ్రీ అధికారితో క‌లిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఎలా మొద‌లైంది? అస‌లు మల్లేశం పాత్ర కోసం ఎలాంటి గ్రౌండ్ వ‌ర్క్ చేశారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు ద‌ర్శి ఇచ్చిన స‌మాధాన‌మిది. ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ -``మ‌ల్లేశం బ‌యోపిక్ చేయాల‌న్న ఆలోచ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌ రాజుగారికి వ‌చ్చింది. ఆయ‌న జీవితాన్ని ఒక క‌థ‌గా చెప్పాల‌నుకుని ఏడాదిన్న‌ర క్రితం నుంచి ప‌ని మొద‌లు పెట్టారు. ఆ త‌ర్వాత ఆయ‌న న‌న్ను క‌లిశారు. తొలుత‌ ఒక చిన్న సినిమా. మొద‌ట ఈ ప్ర‌పోజ‌ల్ కి మ‌ల్లేశం ఓకే అన్నారు. త‌ర్వాత‌ వెంక‌ట్ సిద్ధారెడ్డి- రాజు - ల‌క్ష్మ‌ణ్ ఏలే (ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్) ప్ర‌తిభావంతులైన‌ క్రూ అంతా కలిశారు. రాజ్ వ‌ల్ల‌నే క‌థ ముందుకొచ్చింది. నిర్మాత కూడా త‌నే. 11 ఏళ్లుగా వారికి సినీరంగంలో అనుభ‌వం ఉంది. ఇంత‌మంది ప‌ట్టుద‌ల ఉండ‌డం వ‌ల్ల‌నే ఈ బ‌యోపిక్ సెట్స్ పైకి వెళ్లింది`` అని తెలిపారు.

అచ్చం మ‌ల్లేశం లానే చేయాలి క‌దా? దానికోసం హోంవ‌ర్క్ ఏదైనా చేశారా? అని ప్ర‌శ్నిస్తే.. ``తొలుత మ‌ల్లేశం ఫ్యామిలీని క‌లిశాను. క‌థేంటో తెలుసుకున్నా. ఎలాంటి కార‌ణాల వ‌ల్ల ఆయ‌న అలా మారారు? అన్న‌ది తెలుసుకున్నా. స్క్రిప్టు ఒక బైబిల్ లా ఉంది. అది సాంతం చ‌దివాను. పాత్ర‌పై అవ‌గాహ‌ణ వ‌చ్చింది. రాజుగారిని క‌లిశాక‌ .. ఆ త‌ర్వాత మ‌ల్లేశం గారిని క‌లిశాక బెట‌ర్ మెంట్ అనిపించింది. నాకు కూడా ఈ త‌ర‌హా పాత్ర కొత్త‌. ఇదో కొత్త డిస్క‌వ‌రీ. ఇలాంటిది చేయ‌డం బావుంద‌నిపించింది. ఈ పాత్ర‌ చేయాల‌నిపించింది. మ‌ల్లేశం గారిని అర్థం చేసుకోవ‌డం.. అలానే స్క్రిప్టును అర్థం చేసుకోవ‌డం వ‌ల్ల ప‌ని సులువైంది. ఇక న‌న్ను నేను గుర్తించేందుకు స‌హ‌క‌రించే పాత్ర ఇదని అర్థ‌మైంది. ఇక మ‌ల్లేశం గారి ఇంటికి వెళ్లిన‌ప్పుడు త‌న‌తో మాట్లాడిన‌ప్పుడు.. వాస్త‌వ‌ స‌న్నివేశం తెలిశాక‌ గుండె త‌రుక్కుపోయింద‌ని ద‌ర్శి వెల్ల‌డించారు.