Begin typing your search above and press return to search.

వారియర్ ‘ప్రియ’మైన ముచ్చట్లు

By:  Tupaki Desk   |   22 Feb 2018 10:59 AM GMT
వారియర్ ‘ప్రియ’మైన ముచ్చట్లు
X
రెండు నిముషాలు కూడా లేని ఒక చిన్న వీడియో ప్రపంచవ్యాప్తంగా తనకో పెద్ద ఫాలోయింగ్ వచ్చేలా చేస్తే ఏ అమ్మాయికైనా ఎలా ఉంటుంది. ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం ఆ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తోంది. ఇటీవలే విడుదలైన రెండో టీజర్ లో సైతం గన్ గురి పెట్టినట్టు వేళ్ళతో మేజిక్ చేసిన ప్రియా వారియర్ డిమాండ్ మామూలుగా లేదు. ఒరు ఆదార్ లవ్ లో చిన్న పాత్రతో మొదలైన తన ప్రస్థానం ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు ఒమర్ లుల్లు స్క్రిప్ట్ లో మార్పులు చేసి మరీ పాత్ర పరిధి పెంచేదాకా వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఊహించని స్టార్ డం రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రియా వారియర్ చాలా సెలెక్టివ్ గా మీడియాకు అందుబాటులోకి వస్తోంది. అందులో భాగంగానే తమ మనసులో మాటలు బయట పెట్టింది ప్రియా.

కన్ను గీటడం మొదలుకొని గన్ షూట్ చేస్తున్నట్టు తను చేసిన ప్రతిది దర్శకుడు ఒమర్ లుల్లు క్రెడిట్ అని చెప్పిన ప్రియా వారియర్ అవకాశం వస్తే తనను ట్విట్టర్ లో ఆకాశానికెత్తిన సీనియర్ హీరో రిషి కపూర్ తో కూడా నటిస్తాను అని చెప్పింది. కాకపోతే ఒరు ఆదార్ లవ్ ఆగస్ట్ లో విడుదల అయ్యాకే కొత్త సినిమాల గురించి నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఆఫర్స్ మాత్రం వివిధ బాషల నుంచి వెల్లువలా వచ్చి పడుతున్నాయని ఒప్పుకుంది. ప్రియా తన అమ్మానాన్నకు ఒక్కతే కూతురు. తను కాకుండా తన కన్నా చిన్నవయసు కొడుకు సంతానం. అంతే. ప్రియా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఈ ఫ్యామిలీ తోనే ఉంటున్నారు. బాలీవుడ్ తన డ్రీం అన్న ప్రియా షారుఖ్ ఖాన్ - రన్వీర్ సింగ్ - సిద్దార్థ్ మల్హోత్రా ఫేవరెట్స్ అని చెప్పింది. దీపిక పదుకునే నటన అంటే పడి చచ్చే ప్రియా పద్మావతిని తన కోసమే పలుమార్లు చూసిందట.

నిజంగా అదృష్టమంటే ప్రియా వారియర్ దే. ఒక సపోర్టింగ్ రోల్ కోసం సినిమాలో నటింపజేస్తే అందులో అందరిని పక్కకు తోసేసి దేశవ్యాప్త పాపులారిటీ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. సన్నీ లియోన్ తర్వాత గూగుల్ లో మనవాళ్ళు వెతికింది ప్రియా గురించేనట. ఇలా జరగడం చాలా అరుదు కనక ప్రియా వారియర్ ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకా ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్న ప్రియ వారియర్ మూడేళ్ళ కోర్స్ పూర్తి చేయటం కష్టమే.