నీకు చదువు బెటరమ్మాయ్...

Thu Jun 13 2019 07:00:02 GMT+0530 (IST)

సడెన్ గా దక్కినది నిలబడదు అన్న నానుడి కరెక్టేనేమో. 30 సెకన్ల వీడియోతో తెల్లారేలోపు ఇండియాకే హాట్  ఫేవరెట్ గా మారిన అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఆమె పాపులారిటీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బాహుబలి ఎంత మందికి తెలుసో ఆ అమ్మాయి కూడా అంత మందికి తెలుసు.30 సెకెండ్ల వీడియలో 10 సెకెండ్ల హావభావాలతోనే దేశాన్ని పడుకోబెట్టిన ఈ అమ్మాయి ఇక మొత్తం సినిమా రిలీజ్ అయితే మిగతా హీరోయిన్లందరూ బెంబేలెత్తిపోతారు అని చాలా ఊహించారు. కానీ ఈ టీనేజర్... ఓ ట్రైలర్ వండర్ లా మిగిలిపోయింది.  సినిమాలో తేలిపోయింది. ‘ఒరు అడార్ లవ్’లో ఆమె యాక్టింగ్ చూసి జనాలు షాకైపోయారు. ఉన్న ఒక్క అద్భుతం ట్రైలర్ లో కనిపించింది. అంతకుమించి చూడడానికి ఏం అద్భుతాలు మిగల్లేదు. సినిమా చూసిన వారందరి అభిప్రాయం ఇదే. దీంతో ఎంత వేగంగా పాపులర్ అయ్యిందో అంతే వేగంగా ఆమెను దూరం పెట్టారు సినిమా వాళ్లు. ఫ్యూచర్ హీరోయిన్ ని తక్కువ రేటుకు పట్టేశాం అని ఫీలయిన కార్పొరేట్లంతా డీలా పడిపోయారు. మరి ఈ అమ్మాయి ఇపుడు ఏం చేస్తుందని డౌట్ కదా... చదువుకుంటోంది. ఇంకో ఏడాదిలో డిగ్రీ అయిపోతుందట.

సినిమా కెరియర్ తర్వాత చూద్దాం గాని ముందుకు చదువుకో బుద్ధిగా అని తల్లిదండ్రలు మొట్టికాయలు వేస్తున్నారట. గురువులు కూడా నువ్వు చురుకైన దానివన్నా... చక్కగా చదువుకో అంటున్నారట. ఇదే విషయాన్ని ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘‘చదువును మధ్యలోనే ఆపాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదు. అలా చేయడం వారికి ఇష్టం లేదు. నాకు చదువు చెప్పిన టీచర్ల అభిప్రాయం ఏంటంటే.. నేను నటన కంటే చదువులోనే చురుకుగా ఉంటానట. నటన ఆపేసి చదువుపై దృష్టిసారించాలని చెబుతున్నారు. కానీ అది వారి అభిప్రాయం. నాకు చదువు కంటే సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం. నేనేమీ ఫస్ట్‌క్లాస్ స్టూడెంట్ ని కాను. కాలేజ్ కి వెళుతున్నందుకు గ్రేస్ మార్కులు కూడా పడవు. నేను మరో ఏడాది లో డిగ్రీ పట్టా అందుకుంటాను’’ ఇది ప్రియ డైరెక్ట్ వెర్షన్. అంటే అమ్మాయికి సినిమా పిచ్చి బాగా స్ట్రాంగ్ గా ఎక్కినట్టుంది. ఆ మాత్రం ఉండాల్లే. లేకపోతే ఇక్కడి ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటం సామాన్య విషయమేమీ కాదుగా. ఆమె నటన చూసిన ప్రేక్షకులు మాత్రం మీ తల్లిదండ్రులు నీకంటే  తెలివైన వాళ్లని సెటైర్లు వేస్తున్నారు.