రెండు కనురెప్పలు-రెండు మిలియన్లు

Tue Feb 13 2018 21:00:01 GMT+0530 (IST)

టైం ఎవరికి ఎప్పుడు ఎలా కలిసి వస్తుందో ఎవరు చెప్పలేరు అనేదానికి నిదర్శనంగా ప్రియా ప్రకాష్ వారియర్ నిలుస్తోంది. ఒక్క పాటతో సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్టార్ అయిపోయిన ప్రియ వారియర్ యు ట్యూబ్ ఫేస్ బుక్ ఇన్స్ టాగ్రామ్ ఇలా ఒక్కొక్క ప్లాట్ ఫార్మ్ ని సునామిలా కప్పేస్తోంది. ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే చాలు తన వీడియోలు తప్ప ఇంకేమి కనిపించడం లేదు. దీనికి తోడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కేజ్రీవాల్ డోనాల్డ్ ట్రంప్ ఇలా ప్రముఖులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ని ప్రియా వీడియోతో జోడించి చేసిన  స్పూఫ్ లు లక్షల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. ఒమర్ లుల్లు దర్శకత్వం వహించిన ఆ పాట ఉన్న మూవీ కోసం విపరీతమైన ఆసక్తి నెలకొంది.ఒక్క రోజులో 6 లక్షల ఫాలోయర్స్ ని సంపాదించుకున్న ప్రియ వారియర్ కన్నా ముందు కేవలం ఇద్దరే ఆ ఫీట్ సాధించిన సంగతి తెలిసిందే. కైలీ జెన్నర్ - రోనాల్డో తర్వాత ఇది తనకే సాధ్యమైంది. ప్రస్తుతం 2 మిలియన్లు దాటేసిన ప్రియ వారియర్ ఇన్స్ టాగ్రామ్ ఎకౌంటు అంతకంతకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. మలయాళం క్రేజీ యూత్ స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ కు కూడా అంత ఫాలోయింగ్ లేదు. అతని సంఖ్య ఇంకా 2 మిలియన్లు చేరుకోలేదు. 1.9 దగ్గర ఉన్నాడు. ఇది చూసి కాకలు తీరిన సోషల్ మీడియా సెలెబ్రీటీలు ఆశ్చర్యపోతున్నారు.

ప్రియ వారియర్ ఇంటి దగ్గర మీడియా హడావిడి మామూలుగా లేదు. ఇంటర్వ్యూలు ఇవ్వమని వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఆమె తల్లి ప్రియను ఏకంగా హాస్టల్ కు పంపించేసిందట. ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ అయిన ప్రియ వారియర్ కు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళడం కూడా కష్టంగానే ఉందట. మొత్తానికి ఒక్క మాట మాట్లాడకుండా కనురెప్పలు చేసిన సైగలతో పాపులారిటీ సంపాదించుకున్న ప్రియ వారియర్ అదృష్టాన్ని చూసి ఈర్ష్య పడని అమ్మాయి ఉంటుందా.