ఆ హీరో 13 ఏళ్లకే డ్రగ్స్ తీసుకునేవాడట

Sat Aug 12 2017 15:35:38 GMT+0530 (IST)

టాలీవుడ్ డ్రగ్స్ రిలేషన్స్ మీద దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్న పరిస్థితి. ఈ డ్రగ్స్ రచ్చకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన టాలీవుడ్ లో అయితే పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు ఎలాంటి విషయం బయటకు వస్తుందోనన్న టెన్షన్ తో ఉంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.

ఇదిలా ఉంటే.. డ్రగ్స్ కు సంబంధించిన మరో సంచలన విషయాన్ని చెప్పుకొచ్చాడో బాలీవుడ్ స్టార్ హీరో. లెజండరీ సినీ కపుల్ గా దేశ ప్రజలకు సుపరిచితులైన రాజ్ బబ్బర్.. స్మితా పాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయాల్ని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రతీక్.. ఇప్పటివరకూ వెల్లడించని తన టీనేజ్ విషయాల్ని వెల్లడించాడు.

రాజ్ బబ్బర్.. స్మితా పాటిల్ లాంటి ప్రముఖుల కడుపున పుట్టినప్పటికీ తాను జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పాడు. అందరికి ప్రతీక్ బబ్బర్ గా తెలిసినప్పటికీ తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలీదని.. తన పదమూడేళ్ల వయసులోనే ఏదో తెలీని అసంతృప్తి తనను వెంటాడేదన్నారు.

స్కూల్లో ఉన్నప్పుడే డ్రగ్స్ కు అలవాటు పడిపోయానని..  అప్పట్లో తనకు డ్రగ్స్ విష వలయం గురించి తెలీదన్నాడు. డ్రగ్స్ తో జీవితం ఎలా నాశనమవుతుంది?  వాటిని ఎలా జయించాలి? అన్న విషయాల్ని పలువురికి తెలియజేయాలని తాను అనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఏక్ దివానా థా మూవీతో బాలీవుడ్ అరంగ్రేటం చేసిన ప్రతీక్.. చాలా కష్టమ్మీద డ్రగ్స్ ను జయించానని చెప్పాడు.

చాలా చిన్న వయసులోనే సమాధానాలు తెలీని ప్రశ్నలెన్నో తనను వేధించేవని.. దీంతో తాను డ్రగ్స్ వైపు వెళ్లానని చెప్పారు. ఎలాంటి డ్రగ్ ను అయినా వాడేసేవాడినని.. ఒక దశలో తాను పూర్తిగా డ్రగ్ ఎడిక్ట్ అయిపోయినట్లు చెప్పారు. తన డ్రగ్స్ జీవితం గురించి ఎవరికైనా తెలిస్తుందేమోనని భయపడేవాడినని.. ఒక దశలో తనను తాను చూసుకోవటానికి కూడా బయపడిపోయినట్లు చెప్పాడు. జీవితాన్ని నాశనం చేసుకోవటం కంటే డ్రగ్స్ ను వదిలేయటం మంచిదన్న విషయాన్ని తనను చూసైనా తెలుసుకోవాలన్నాడు. ఏమైనా.. తన ఇమేజ్ ను.. గ్లామర్ ను పక్కన పెట్టి.. తన జీవితంలోని మరో కోణాన్ని చెప్పి.. రియల్ హీరో అనిపించుకున్నాడని చెప్పక తప్పదు. డ్రగ్స్ ను వాడుతూ.. విష వలయంలో చిక్కుకుపోయే కన్నా.. దాన్లో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తే మంచిది.