‘అ!’ డైరెక్టర్.. ముప్పై కథలున్నాయట

Sun Feb 18 2018 21:00:01 GMT+0530 (IST)

ఈ వీకెండ్లో విడుదలైన ‘అ!’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ. నాని దగ్గరికి వాయిస్ ఓవర్ కోసం వెళ్తే కథ నచ్చి సినిమానే నిర్మించడానికి ముందుకొచ్చాడంటే ఈ కుర్రాడి టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. విడుదలకు ముందే ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ‘అ!’ సినిమా. ఈ చిత్రం విషయంలో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం ఇది బాగానే నచ్చింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం దాని స్థాయిలో అది బాగానే ఆడుతోంది. కమర్షియల్ గా కూడా ఇది సక్సెస్ అయ్యేలాగే కనిపిస్తోంది.దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే నాని నిర్మాణంలో సినిమా చేసిన ప్రశాంత్.. భవిష్యత్ ప్రణాళికలు భారీగానే వేసుకున్నట్లున్నాడు. అతడి దగ్గర ఒకటి రెండు కాదు.. 30 కథలు ఉన్నాయట. ఆ కథల్లో కొన్ని తాను డైరెక్ట్ చేస్తానని.. కొన్ని బయటి వాళ్లకు అమ్ముతానని ప్రశాంత్ చెబుతుండటం విశేషం. తన తర్వాతి సినిమా ఎవరితో అన్నది ఇంకా ఖరారవ్వలేదని.. ఐతే ‘అ!’ తరహాలోనే అది కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్పాడు ప్రశాంత్. ‘అ!’ సినిమా అందరికీ తొలిసారి చూసినపుడు అర్థం కాకపోవచ్చని.. కానీ రెండోసారి మూడోసారి చూస్తే ఈ కథ బాగా అర్థమై నచ్చుతుందని చెప్పాడు ప్రశాంత్. ఈ సినిమా చూసిన కొందరు కంగ్రాట్స్ చెప్పకుండా.. ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అనడం తనకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ అని చెప్పాడు. ముందు ‘అ!’ సినిమాను తనే ప్రొడ్యూస్ చేయాలనుకున్నానని.. అనుకోకుండా నాని ఈ సినిమాను నిర్మించాడని.. అప్పుడు తన బాధ్యత మరింత పెరిగిందని.. అతడి నమ్మకాన్ని నిలబెట్టాలని మరింత కష్టపడ్డానని ప్రశాంత్ తెలిపాడు.