Begin typing your search above and press return to search.

కొత్త సినిమా.. అరవై ఏళ్లు చామన ఛాయ

By:  Tupaki Desk   |   26 Sep 2016 8:18 AM GMT
కొత్త సినిమా.. అరవై ఏళ్లు చామన ఛాయ
X
దర్శకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు తీశాడు ప్రకాష్ రాజ్. కానీ ఏవీ సరైన ఫలితాన్నివ్వలేదు. నాలుగో సినిమా ‘మన ఊరి రామాయణం’ ఇంకో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. అది ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఏమో కానీ.. ఈ లోపే దర్శకుడిగా తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు ప్రకాష్. ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్ ఖాయం చేశాడు ప్రకాష్ రాజ్. ‘అరవై ఏళ్లు.. చామన చాయ’.. ఇదీ ప్రకాష్ రాజ్ కొత్త సినిమా పేరు. ఈ సినిమాలో ఆయనే లీడ్ రోల్ చేస్తున్నారు. తెలుగు-తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుంది. ఇది డైరెక్ట్ మూవీ కాదు.. రీమేక్.

‘గోధి బన్న సాధారణ మైకత్తు’ పేరుతో మూడు నెలల కిందట కన్నడలో ఓ సినిమా వచ్చింది. సీనియర్ నటుడు అనంత్ నాగ్.. రక్షిత్ శెట్టి అనే యువ నటుడు కీలక పాత్రలు పోషించిన సినిమా ఇది. హేమంత్ రావు అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. మతి స్థిమితం తప్పిన ఓ తండ్రి తప్పిపోతే.. అతణ్ని వెతుక్కుంటూ సాగే కొడుకు కథ ఇది. అప్పటిదాకా తండ్రి అంటే చిరాకు పడే కొడుకు.. తండ్రిని వెతికే క్రమంలో ఆయన గొప్పదనం తెలుసుకుంటాడు. చాలా హృద్యంగా సాగే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా చూడగానే ముగ్ధుడైపోయిన ప్రకాష్ రాజ్.. దానిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ తర్వాత రీమేక్ రైట్స్ తీసుకుని.. స్వీయ దర్శకత్వంలో నిర్మించడానికి సిద్ధపడ్డారు. మాతృకలో అనంత్ నాగ్ పోషించిన పాత్రనే ప్రకాష్ రాజ్ చేయనున్నారు. మరి ఆయన కొడుగ్గా నటించేదెవరో చూడాలి.