ప్రభుదేవా మళ్లీ డ్యాన్స్ కుమ్మేస్తున్నాడు

Fri Feb 23 2018 05:00:01 GMT+0530 (IST)

ఇండియన్ మూవీస్ లో డ్యాన్సులు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ.. వాటికి విపరీతమైన వేగం అందించి.. డ్యాన్స్ తోనే నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభుదేవా. ఇప్పుడు దర్శకుడిగా మారిన తర్వాత తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ ని అడపా దడపా మాత్రమే చూపిస్తున్నాడు. ఏబీసీడీ.. స్టైల్ వంటి చిత్రాలలో తన నృత్య ప్రతిభను చూపాడు ప్రభుదేవా.ఇప్పుడు మరోసారి పూర్తిస్థాయిలో డ్యాన్స్ లను చూపించేందుకు వచ్చేస్తున్నాడు. లక్ష్మి అనే టైటిల్ పై ఓ సినిమా రూపొందుతుండగా.. ఓ డ్యాన్సింగ్ లెజెండ్.. అతని స్టూడెంట్ లక్ష్మి కథే ఈ చిత్రం. ప్రభుదేవాతో అభినేత్రి వంటి చిత్రాన్ని రూపొందించిన ఏఎల్ విజయ్.. ఈసారి ఈ హీరో డ్యాన్సింగ్ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోబోతున్నాడు. ఇప్పుడీ లక్ష్మి చిత్రానికి టీజర్ ను విడుదల చేయగా.. నిమిషం పాటు సాగే ఈ ట్రైలర్ లోనే ఈ సినిమాలో డ్యాన్స్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో తెలియచేసేశారు.

అసలు కాన్సెప్టే డ్యాన్స్ కాంపిటీషన్స్ కాబట్టి.. ఏ యాంగిల్ లో చూసినా డ్యాన్స్ తప్ప మరేమీ కనిపించలేదు. ప్రభుదేవా స్టూడెంట్ గా నటించిన అమ్మాయి కూడా.. ఇరగదీసి పారేసింది. ఆమెకు ట్రైనింగ్ ఇచ్చే పాత్ర చేసిన ప్రభుదేవా.. తనలోని నాట్య ప్రతిభను కూడా బాగానే చూపించాడు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ప్రభుదేవా డ్యాన్సులను పూర్తిస్థాయిలో ఆనందించే అవకాశం లక్ష్మి అందిస్తోంది.