Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఉద్య‌మానికి డార్లింగ్ బాస‌ట‌

By:  Tupaki Desk   |   17 Sep 2019 4:18 AM GMT
కేటీఆర్ ఉద్య‌మానికి డార్లింగ్ బాస‌ట‌
X
వైర‌ల్ ఫీవ‌ర్లతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు కిక్కిరిసిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇదే స‌న్నివేశం నెల‌కొంది. దీంతో ఆస్ప‌త్రి వ‌ర్గాలు నానా హైరానా ప‌డుతున్నాయి. వైర‌ల్ అన్న పేరుకు త‌గ్గ‌ట్టే సామాన్యుడు- సెల‌బ్రిటీ అనే తేడా లేకుండా అంద‌రికీ అంటుకుంటున్నాయి జ్వ‌రాలు. ఇందులో డెంగీ- మ‌లేరియా- టైపాయిడ్ లాంటి ప్ర‌మాద‌క‌ర జ్వ‌రాలు భ‌య‌పెట్టేస్తున్నాయి.

అయితే ఇదంతా ఎందుకని? ప‌రిస‌రాల పారిశుధ్యం లేక‌పోవ‌డం ఒక కార‌ణం అయితే ఇండ్ల చుట్టూ నీటి కుంట‌లు.. నీరు నిల్వ ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లే కార‌ణం. అక్క‌డ దోమ‌లు స‌మృద్ధిగా పెరిగి జ్వ‌రాల‌కు కార‌ణం అవుతున్నాయి. ఈ మాత్రం కామ‌న్ సెన్స్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌తిసారీ ప్ర‌భుత్వాలు నేర్పించాల్సిన దుస్థితి ఉంది. అయితే అన్ని స‌దుపాయాలు ఉన్న సెల‌బ్రిటీల‌కు వైర‌ల్ జ్వ‌రాలు అంటుకోవ‌డం మ‌రో విచిత్రం. ఇటీవ‌లే కింగ్ నాగార్జున .. సాహో డైరెక్ట‌ర్ సుజీత్ లాంటి వాళ్ల‌కే ఈ తిప్ప‌లు త‌ప్ప‌లేదు. నాగార్జున‌కు వైర‌ల్ ఫీవ‌ర్.. సుజీత్ కి డెంగీ ఫీవ‌ర్ వ‌చ్చాయి. ఆ త‌ర్వాత వాటికి చికిత్స తీసుకుని బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగారు.

ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర యువ‌మంత్రి కేటీఆర్ చొర‌వ తీసుకుని ప‌రిస‌రాల పారిశుధ్యంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఆయ‌న పిలుపును అందుకుని ప‌లువురు సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా ద్వారా విస్త్ర‌త ప్ర‌చారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న డెంగ్యూ వ్యాధి నుంచి మీ కుటుంబాలను కాపాడుకోండి అంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపున‌కు నాగార్జున స‌హా ప‌లువురు స్టార్లు ప్ర‌తిస్పందించారు. సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ప్ర‌తిస్పందించారు. ``దయచేసి మిమ్మిల్ని.. మీ ఫ్యామిలీని డెంగ్యూ నుంచి కాపాడుకోండి. మీ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను ప్రతిరోజు తనిఖీ చేయండి. ఇంట్లో ఉండే ట్యాంక్‌ లు.. పూలకుండీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి`` అంటూ ఫేస్ బుక్ ద్వారా కోరారు ప్ర‌భాస్. త‌న ఇంటి ప‌రిస‌రాల్లో గార్డెన్ ని ప‌రిశీలిస్తున్న‌ ఫోటోని షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అభిమానుల్లోకి దూసుకెళుతోంది.