Begin typing your search above and press return to search.

ఫైనల్ గా దుబాయ్ వెళ్ళిన సాహో

By:  Tupaki Desk   |   21 April 2018 8:03 AM GMT
ఫైనల్ గా దుబాయ్ వెళ్ళిన సాహో
X
బాహెబ‌లి ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ కోసం భారీగా సిద్ధ‌మ‌వుతున్న సినిమా సాహో. ఈ సినిమా హీరోయిన్ నుంచి విల‌న్ వ‌ర‌కు ఎక్కువ‌మంది బాలీవుడ్ న‌టులే. 2019లో విడుద‌లయ్యే మోస్ట్ వాంటెడ్ సినిమా సాహోనే. నిర్మాత‌లు ఇంకా సినిమా విడుద‌ల గురించి ప్ర‌క‌ట‌న చేయ‌న‌ప్ప‌టికీ... వ‌చ్చే ఏడాది మొద‌ట్లో సాహో విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఈ సినిమా యూనిట్‌ ప్ర‌స్తుతం అతి భారీ ఫైట్ సీన్‌ను చిత్రీక‌రించే ప‌నిలో ఉంది. ఈ ఫైట్ సీన్ కోసం ఎప్పుడూ లేనిది రూ.30 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెడుతున్నార‌ట నిర్మాత‌లు.

చాలా రోజుల వెయిటింగ్ తరువాత.. ఫైనల్ గా సాహో టీమ్ దుబాయ్ లో షూటింగ్ చేస్తోంది. ఈ రోజునుంచే భారీ ఫైట్ సీన్ చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వ్వ‌బోతోంది. ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాతి గాంచిన క‌ట్ట‌డం బూర్జ్‌ ఖ‌లీఫా చుట్టూ ఈ ఫైటింగ్ సీన్ ఉంటుంద‌ట‌. ప్ర‌భాస్‌తో పాటూ సాహోలో మెయిన్ విల‌న్ నీల్ నితిన్ ముఖేష్ కొంత‌మంది ఫైట‌ర్లు పాల్గొంటారు. ఈ ఫైట్ కోసం ఏ చిత్ర సీమ‌లో ఖ‌ర్చుపెట్ట‌నంత సొమ్మును సాహో నిర్మాత‌లు పెట్టుబ‌డిగా పెట్టేందుకు ముందుకు వ‌చ్చారు. సినిమాకు ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్ అవుతుంద‌ని చెబుతోంది చిత్ర యూనిట్‌. ఈ యాక్ష‌న్ సీన్ చిత్రీక‌ర‌ణ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ కెన్నీ గేట్స్‌ను తీసుకొచ్చింది చిత్ర బృందం. దుబాయ్ షెడ్యూల్ లో హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ సీన్లు కూడా ఉన్నాయిట‌. ఇప్పుడు మరో బాలీవుడ్ భామ ఎవ‌లిన్ శ‌ర్మ కూడా టీమ్‌లో చేర‌నుంది.

సాహో విల‌న్ నీల్ నితిన్ ముఖేష్ మోస్ట్ స్టైలిష్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఫైటింగ్ కోసం శిక్ష‌ణ తీసుకుంటున్న నీల్ ఒక ఫోటోను త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ ఫోటోను చూస్తే యాక్ష‌న్ సీన్లు ఎక్కువే ఉన్న‌ట్టు అర్థ‌మైపోతుంది. సాహోను యూవీ క్రియేష‌న్స్ పై సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో తీస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. హిందీ తెలుగు త‌మిళ భాషల్లో సాహోను ఒకేరోజు విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్‌చేసింది.