ప్రభాస్ క్రేజ్ కి బాలీవుడ్ సాహో

Tue Apr 17 2018 14:11:26 GMT+0530 (IST)

బాహుబలి సినిమాతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా క్రేజియెస్ట్ స్టార్ గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత కుర్ర దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న సాహో సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. అయితే వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే లేటయినా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.తాజాగా సాహో హిందీ వెర్షన్ హక్కులు దిమ్మతిరిగే రేటుకి అమ్ముడుపోయాయి. ఏకంగా 120 కోట్లు చెల్లించి సాహో సినిమా హిందీ హక్కులను కొనుక్కుంది టీ- సిరీస్ సంస్థ. సాహో సినిమా కోసం చాలా కంపెనీలే పోటీ పడినా అందరికంటే ఎక్కువ కోట్ చేసి... ప్రభాస్ సినిమాను సొంతం చేసుకుంది టీ- సిరీస్. సాహో సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పుడు హిందీ హక్కుల ద్వారానే అందులో 60 శాతం రాబట్టగలిగాడు ప్రభాస్. తెలుగు - తమిళ హక్కులు ఇంకా మిగిలే ఉన్నాయి. సో... అన్నీ కలిపి సాహో సినిమా బిజినెస్ భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. టీ- సిరీస్ సంస్థ ఇప్పుడు సాహో సినిమా హిందీ వెర్షన్ కి సహ-నిర్మాతలుగా వ్యవహరించడంతో పాటు అన్ని భాషల్లో సమర్పకులుగా ఉంటారుట.

బాహుబలి 2 హిందీ వర్షన్ ఏకంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది.ఇప్పటిదాకా దేశంలో ప్రభాస్ సినిమాదే రికార్డు. ఆ నమ్మకంతోనే సాహో సినిమాపైన ఇంత భారీ మొత్తం పెట్టడానికి వెనకాడలేదు టీ- సిరీస్. గత ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికీ సగం మిగిలే ఉంది. ఎలాగైనా త్వరత్వరగా షూటింగ్ ముగించి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటోంది చిత్ర బృందం.