‘బాహుబలి’కి ప్రభాస్ ఎంత తీసుకున్నట్లు?

Fri Apr 21 2017 12:33:03 GMT+0530 (IST)

‘బాహుబలి’ కోసం రాజమౌళి తర్వాత అత్యంత కష్టపడింది.. అంత కమిట్మెంట్ చూపించింది ఎవరు అంటే మరో మాట లేకుండా ప్రభాస్ పేరు చెప్పేయొచ్చు. మధ్యలో వేరే సినిమా చేసుకునే అవకాశమున్నా ప్రభాస్ ఉపయోగించుకోలేదు. నాలుగేళ్ల పాటు ఈ ఒక్క సినిమాకే అంకితమైపోయాడు. మామూలుగా అయితే ఈ నాలుగేళ్లలో ఏడెనిమిది సినిమాలు చేసేసి ఉండొచ్చు. ఎంతో సంపాదించి ఉండొచ్చు. కానీ ప్రభాస్ అలా చేయలేదు. మరి అతను చూపించిన కమిట్మెంట్ కు.. పడ్డ కష్టానికి.. వెచ్చించిన సమయానికి ఎంత విలువ కట్టాలి..? ‘బాహుబలి’ నిర్మాతలైతే ఈ విలువను రూ.75 కోట్లుగా తేల్చినట్లు సమాచారం.

‘బాహుబలి’ రెండు భాగాలకు కలిపి ప్రభాస్ కు రూ.75 కోట్ల పారితోషకం ముట్టినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదేమీ ముందుగా చేసుకున్న ఒప్పంద మొత్తం కాదు. ముందు తొలి భాగానికి రెండేళ్లకు పని చేయడానికి ప్రభాస్ ఒకప్పటి తన రేంజ్ ప్రకారమే పారితోషకం అడిగాడు. కానీ ఈ సినిమా ఆ తర్వాత రెండు భాగాలైంది. వర్కింగ్ డేస్ పెరిగాయి. సినిమా రేంజ్ కూడా ఊహించని స్థాయికి చేరింది. రెండు భాగాలకు కలిపి ఆదాయం కూడా అనూహ్యంగా వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు రూ.75 కోట్లు ముట్టజెప్పారట నిర్మాతలు. దీన్ని బట్టి ‘బాహుబలి’ సృష్టికర్త రాజమౌళికి.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అతడి కుటుంబం మొత్తానికి ఎంత పారితోషకం అంది ఉంటుందో అంచనా వేయొచ్చు. ప్రభాస్ విషయానికి వస్తే.. ‘బాహుబలి’కి ఊహించని స్థాయిలో పారితోషకం అందుకోవడమే కాదు.. ఈ సినిమా ద్వారా చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. ‘బాహుబలి’కి ముందు ప్రభాస్ సినిమాకు రూ.25-30 కోట్ల బిజినెస్ జరిగేది. ఇప్పుడు అతనొక్కడే ఆ స్థాయిలో పారితోషకం అందుకునే స్థాయికి వచ్చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/