Begin typing your search above and press return to search.

‘బాహుబలి’ వల్ల నష్టమా?

By:  Tupaki Desk   |   28 Sep 2016 10:30 PM GMT
‘బాహుబలి’ వల్ల నష్టమా?
X
స్టార్ హీరోల సినిమాలైనా సరే.. ఇప్పుడు మూణ్నాలుగు నెలల్లో షూటింగ్ అయిపోతోంది. ప్రతి హీరో కూడా ఏడాదిలో రెండు సినిమాలైనా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి టైంలో ఒక ప్రాజెక్టు కోసం దాదాపు నాలుగేళ్లు వెచ్చించడం అంటే చిన్న విషయం కాదు. ప్రభాస్ ఆ సాహసం చేశాడు. ‘బాహుబలి’ కోసం నాలుగేళ్ల సమయం కేటాయించాడు. రెండో భాగం తీయాలన్న ఆలోచన తర్వాత వచ్చింది కాబట్టి సమయం పెరిగిందనుకున్నా.. ముందు ఈ చేద్దాం అన్న అంగీకారం కుదిరినపుడే ప్రభాస్ రెండేళ్ల పాటు డేట్లు కేటాయించడానికి ఓకే అనేశాడు. రాజమౌళి ఏడాది పాటు డేట్లు అడిగితే.. ప్రభాసే డబుల్ చేసి ఇచ్చాడు. ఆ టైంలో అందరికీ ప్రభాస్ రాంగ్ స్టెప్ వేస్తున్నాడనే అనిపించింది. కెరీర్ మంచి ఊపులో ఉండగా.. అంత టైం ‘బాహుబలి’కి కేటాయించడం వల్ల అతను నష్టపోతాడన్న వాళ్లూ ఉన్నారు.

సీన్ కట్ చేస్తే.. ‘బాహుబలి’ విడుదల తర్వాత అంతా మారిపోయింది. ఈ సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు తెలుగులో మాత్రమే కాక.. తమిళం.. మలయాళం.. హిందీ భాషల్లోనూ అతడికి మార్కెట్ పెరిగింది. ‘బాహుబలి’కి కేటాయించిన నాలుగేళ్ల కాలానికి అతను ఎంత పారితోషకం తీసుకున్నాడు.. అతను నష్టపోయాడా లాభ పడ్డాడా అన్నది తర్వాత సంగతి. కానీ ఈ సినిమా కారణంగా అతడి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభాస్ సినిమా అంటే ఇకపై ఈజీగా వంద కోట్లు పెట్టేయొచ్చు. అందులో ఓ 20 శాతం అయినా అతడికి పారితోషకం ఇచ్చేయొచ్చు అన్న భరోసా నిర్మాతలకు వచ్చేసింది. ప్రభాస్ తో తర్వాత సినిమా చేయబోయే ‘యువి క్రియేషన్స్’ అదే చేయబోతోంది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా బడ్జెట్ రూ.100 కోట్లు. ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా రూ.20 కోట్ల పైమాటేనట. ఈ చిత్రం తెలుగు-తమిళం-కన్నడ భాషల్లో రూపొందనుంది. ఈ సినిమా హిందీ హక్కుల్ని మాత్రమే రూ.30 కోట్లకు అమ్మే ప్లాన్లో ఉన్నారట. ఇకపై ప్రభాస్ సినిమాలన్నీ ఈ రేంజిలోనే ఉంటాయి. మరి ‘బాహుబలి’ వల్ల అతను నష్టపోయినట్లా.. లాభ పడ్డట్లా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/