Begin typing your search above and press return to search.

జక్కన్నా.. ప్రభాస్ ఫ్యాన్స్ హర్టయ్యారు

By:  Tupaki Desk   |   28 Aug 2015 1:50 PM GMT
జక్కన్నా.. ప్రభాస్ ఫ్యాన్స్ హర్టయ్యారు
X
మనకు ఫాల్స్ రికార్డులొద్దు.. అలాంటి రికార్డుల కోసం బాహుబలి సినిమాను బలవంతంగా ఆడించొద్దు అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు రాజమౌళి. డైరెక్టరే అలా అనేసరికి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బాహుబలిని 50వ రోజు రోజు ఆడించే విషయంలో పెద్దగా పట్టు బట్టలేదు. శుక్రవారం నాటికి ‘బాహుబలి’ 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంటుంది. ఐతే చాలా చోట్ల 50 రోజుల మార్కు అందుకోకుండానే థియేటర్ల నుంచి ‘బాహుబలి’ని తీసేశారు. ఐతే బాహుబలి స్థానంలో వస్తున్న సినిమాలేమైనా క్రౌడ్ పుల్లర్సా అంటే అదేమీ కాదు. బెస్ట్ యాక్టర్స్, మాలిని అండ్ కో, బ్లేడ్ బ్యాచ్, డాలర్ కి మరోవైపు, విక్రమార్కుడి లవ్ స్టోరీ, తరువాత కథ.. ఇవీ ఈ రోజు విడుదలైన సినిమాలు.

పైన చెప్పుకున్న సినిమాల్లో దేనికీ కూడా పెద్దగా క్రేజ్ లేదు. అయినప్పటికీ ఈ చిన్న సినిమాలన్నింటికీ థియేటర్లు ఇవ్వడం కోసం చాలా చోట్ల ‘బాహుబలి’ని తీసేయాల్సి వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒకింత నొచ్చుకున్నట్లు సమాచారం. అభిమానులు పట్టుబట్టడం వల్ల ముందు శుక్రవారం కూడా బాహుబలిని కొనసాగించాలని ఎగ్జిబిటర్లు అనుకున్నా.. జక్కన్న స్టేట్మెంట్ తో వెనక్కి తగ్గారు. ‘బాహుబలి’ 500 కోట్ల క్లబ్ లో చేరడం సంతోషాన్నిచ్చినా.. 50 డేస్ ఆడటం అన్నది అరుదైపోతున్న ఈరోజుల్లో తమ సినిమా చాలా కేంద్రాల్లో 50 రోజులాడిందని ఘనంగా చెప్పుకుందామనుకుంటే జక్కన్న ఆ అవకాశం లేకుండా చేశాడే అని ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాలా థియేటర్ల నుంచి తీసేసినప్పటికీ ‘బాహుబలి’ 50 డేస్ సెంటర్ల నెంబర్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉండటం విశేషం.