Begin typing your search above and press return to search.

ప్రభాస్ సంగతి ‘సాహో’ తర్వాత తేలుద్దాం

By:  Tupaki Desk   |   29 April 2017 11:20 AM GMT
ప్రభాస్ సంగతి ‘సాహో’ తర్వాత తేలుద్దాం
X
ఒక హీరో కొత్త సినిమా కలెక్షన్లను బట్టే అతడి మార్కెట్ స్టామినా ఏంటన్నది లెక్కగడతారు. టాలీవుడ్లో అయితే మామూలుగా కలెక్షన్లకు.. దర్శకుడికి సంబంధం ఉండదు. కలెక్షన్ల రికార్డుల్ని హీరోలకే ఆపాదిస్తారు. వాటిని బట్టే హీరో స్థానాన్ని నిర్ణయిస్తారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో రెండు దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యం సాగించాడు. 100 డేస్ సెంటర్లు.. కలెక్షన్ల రికార్డుల్ని ఎప్పటికప్పుడు బద్దలు కొడుతూ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ సాగాడు. ఐతే ఆయన తర్వాత నెంబర్ వన్ ఎవరన్న దానిపై స్పష్టత కొరవడింది. ప్రధానంగా పోటీ పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుల మధ్య నడిచింది. ఒకరి తర్వాత ఒకరు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పారు. ఐతే ఇప్పుడు కలెక్షన్లే ప్రామాణికంగా తీసుకుంటే నెంబర్ వన్ స్థానాన్ని ప్రభాస్ కే కట్టబెట్టాలి.

‘బాహుబలి: ది బిగినింగ్’ పాత రికార్డులన్నీ చెరిపేయగా.. ఇప్పుడు ‘ది కంక్లూజన్’ దాన్ని మించిపోయి.. నభూతో నభవిష్యత్ అన్న తరహాలో కొత్త రికార్డులు నెలకొల్పేలా కనిపిస్తోంది. ఈ సినిమా వసూళ్లను ప్రామాణికంగా తీసుకుని కొందరు ప్రభాస్ నెంబర్ వన్ అంటున్నారు. ఐతే ‘బాహుబలి’ వసూళ్ల క్రెడిట్ కేవలం ప్రభాస్ కే కట్టబెట్టేయడానికి కుదరదు. ఇక్కడ రాజమౌళి ఉన్నాడు. ఆయన ఇమేజ్ హీరోల స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. ‘బాహుబలి’లో ఆయన పాత్ర ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ క్రెడిట్ ప్రభాస్ కు ఉంటుంది కానీ.. అతడితే మొత్తం ఘనత అనడానికి ఎంతమాత్రం వీల్లేదు. ప్రభాస్.. కృష్ణం రాజు వారసత్వాన్నందుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సొంతంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని తన మార్కెట్ స్టామినాను బాగా పెంచుకున్న మాట వాస్తవం. ఐతే అతడి అసలు స్టామినా ఏంటి అన్నది ఇప్పుడే తేల్చేయలేం. ప్రభాస్ నెంబర్ వన్ అని తీర్మానించేస్తున్న వాళ్లు కొంచెం ఓపిక పట్టాలి. యంగ్ రెబల్ స్టార్ అసలు సత్తా ఏంటన్నది ‘సాహో’తో తెలుస్తుంది. ఆ సినిమా వసూళ్లను అతడి మార్కెట్ స్టామినాకు ప్రామాణికంగా తీసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/