Begin typing your search above and press return to search.

ప్రభాస్.. వీరుడు కాదు ప్రేమికుడు

By:  Tupaki Desk   |   23 May 2018 4:27 AM GMT
ప్రభాస్.. వీరుడు కాదు ప్రేమికుడు
X
ఇండియన్ సినిమాలో అత్యంత వీరోచితమైన పాత్రల జాబితా తీస్తే అందులో బాహుబలికి ముందు వరుసలో చోటుంటుంది. ఈ స్థాయిలో హీరోయిజం పండిన సినిమాలు అరుదుగా కనిపిస్తాయి. ఆ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్‌ను అలాంటి పాత్రలో చూశాక ఇక అతడిని సామాన్యమైన క్యారెక్టర్లలో చూపించడం కష్టం. ఈ ప్రభావం ‘సాహో’ మీద బాగానే పడ్డట్లుంది. అందుకే ముందు మామూలు సినిమాగా అనుకున్నదాన్ని కాస్తా చాలా మార్చేశారు. ప్రభాస్ పాత్రను సూపర్ హీరోను చేసి సినిమాను హాలీవుడ్ స్టయిల్లో తీయడానికి సన్నాహాలు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ముచ్చట్లు వింటే మాస్ ప్రేక్షకులకు.. హీరోయిజాన్ని ఆస్వాదించే వాళ్లకు ఇది కనువిందు కాబోతోందని అర్థమవుతోంది. ప్రభాస్ మున్ముందు కూడా ఇలాంటి వీరోచిత పాత్రలే చేస్తాడని అందరూ అనుకుంటున్నారు.

కానీ ప్రభాస్ మాత్రం ఆ ఇమేజ్ ఉచ్చులో చిక్కుకోవాలని అనుకోవట్లేదట. తన తర్వాతి సినిమాలో ఈ స్థాయిలో హీరోయిజం ఉండదని.. అందులో అసలు హీరో ప్రధానం కాదని అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. తన 20వ సినిమా ఒక ప్రేమకథ అని ప్రభాస్ వెల్లడించాడు. అది ఫక్తు ప్రేమ కథ అని చెప్పాడు. ఆ సినిమాలో తాను కానీ.. ఇంకొకరు కానీ ప్రధానం కాదని.. ఆ కథే హీరో అని.. అదే ప్రేక్షకుల్ని మైమరిపిస్తుందని ప్రభాస్ చెప్పడం విశేషం. ‘జిల్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ తన తర్వాతి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ‘జిల్’లో గోపీచంద్‌ తోనే ఓ రేంజిలో హీరోయిజం పండించిన రాధాకృష్ణ.. ప్రభాస్ లాంటి హీరో దొరికితే అతడిని మామూలుగా చూపిస్తాడని.. ప్రేమకథలో ప్రభాస్‌ ను ఫిక్స్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఐతే వైవిధ్యం కోసం ప్రభాస్ ఈ బాటలో సాగిపోవడానికే నిర్ణయించుకున్నట్లుంది. ప్రస్తుతం ‘సాహో’ను నిర్మిస్తున్న యువి క్రియేషన్సే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనున్న సంగతి తెలిసిందే.