వర్మ సరిగా తీయాలే కానీ..

Mon Oct 22 2018 07:00:01 GMT+0530 (IST)

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముంగిట నందమూరి తారక రామారావు హాట్ టాపిక్ కాబోతున్నారు. ఆయన మీద కొంచెం అటు ఇటుగా ఒకే సమయంలో మూడు సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’.. ‘యన్.టి.ఆర్ మహా నాయకుడు’ పేరుతో రెండు సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా లైన్లోకి వచ్చి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో రామారావు జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నట్లు ప్రకటించాడు. ఐతే వీటిలో దేనిపై ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది అన్న చర్చ మొదలైంది.బాలయ్య కథానాయకుడిగా నటిస్తుండటం క్రిష్ దర్శకత్వం వహిస్తుండటం వల్ల ‘యన్.టి.ఆర్’కు క్రేజ్ బాగానే ఉంటుందనడంలో సందేహం లేదు. కాకపోతే కథాంశం పరంగా ప్రేక్షకుల్లో దీని కంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నది వాస్తవం. ఎందుకంటే బాలయ్య-క్రిష్ తీసే ‘యన్.టి.ఆర్’ సినిమాలో గొప్ప మలుపులేమీ ఉండవు. డ్రామాకు పెద్దగా చోటుండదు. సినీ రంగంలో ఎన్టీఆర్ ఎదుగుదల గురించి అందరికీ తెలుసు. ఆయన పెద్దగా కష్టాలేమీ ఎదుర్కోలేదు. అనతి కాలంలో అగ్రహీరోగా ఎదిగారు. ఎదురు లేకుండా సాగిపోయారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం.. రికార్డు కాలంలో ముఖ్యమంత్రి కావడం.. ఇదంతా అందరికీ తెలిసిందే. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు.. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి కావడం కూడా చిన్న విషయమే.

ఐతే ఎన్టీఆర్ జీవితంలో బాధాకరమైన విషయాలు.. డ్రామా అంతా.. చంద్రబాబు వెన్నుపోటు.. ఆ తర్వాతి పరిణామాల్లోనే ఉన్నాయి. ఈ విషయాల్ని మెజారిటీ మీడియా దాచేసింది. అసలు ఆ రోజుల్లో ఏం జరిగిందో ఉన్నదున్నట్లుగా తెలుసుకోవాలన్న కోరిక జనాల్లో ఉంది. ముఖ్యంగా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చారో.. ఆయన చనిపోయే వరకు మధ్యలో ఏం జరిగిందన్నది ఆసక్తికరం. వర్మ ఈ విషయాలే చూపిస్తానంటున్నాడు. కాబట్టి అతను సరిగ్గా సినిమా తీయాలే కానీ.. జనాలు ఈ చిత్రాన్ని బాగా ఆదరించే అవకాశముంది. వర్మ ఆసక్తికరంగా తీస్తే క్రిస్ ‘యన్.టి.ఆర్’కు దీటుగా ఇది ఆడేందుకు ఆస్కారముంది.