పూనం టార్గెట్!... కత్తి - వర్మలేనా?

Thu Jan 18 2018 11:26:20 GMT+0530 (IST)

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సినీ క్రిటిక్ కత్తి మహేశ్ వివాదంలో అనవసరంగా తలదూర్చి... నానా ఇబ్బందులు పడ్డ హీరోయిన్ పూనం కౌర్... మరోమారు ఈ వివాదంలోకి అడుగుపెట్టినట్టుగానే కనిపిస్తోంది. మొన్నామధ్య డైరెక్టర్ గా పేరును ప్రస్తావించకున్నా... పవన్ పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్న కత్తి మహేశ్ ను టార్గెట్ చేస్తూ పూనం కౌర్ ట్విట్టర్ లో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. అయితే పూనంకు ఏమాత్రం తగ్గని కత్తి మహేశ్ కూడా సోషల్ మీడియా వేదికతో పాటు బహిరంగంగానూ బయటకు వచ్చేసి... ఏకంగా పూనం పేరును ప్రస్తావిస్తూ... పవన్ తో తన వివాదాన్ని మరింత పీక్స్ కు తీసుకెళ్లారు. పూనంకు ఏకంగా ఆరు ప్రశ్నలు సంధించిన కత్తి మహేశ్ పలు వర్గాల నుంచి నిరసనలను కూడా ఎదుర్కొన్నారు. అంతేకాకుండా తన పట్టును వీడేందుకు ససేమిరా అన్న కత్తి మహేశ్... పూనం తన ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనన్న తరహాలో పెద్ద యుద్ధమే చేశారు.కత్తి మహేశ్ ఎదురు దాడితో డంగైపోయిన పూనం... ఈ వివాదం నుంచి తనను కాపాడాలని కోరుతూ నేరుగా పవన్ కల్యాణ్ నే కోరుతూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ లను పెట్టేసి ఆ వెంటనే వాటిని తొలగించి పెద్ద కలకలమే రేపారు. ఈ దెబ్బతో పూనం ఇక ఈ వివాదంలోకి దిగదని అంతా భావించారు. అయితే ఉన్నట్లుండి నిన్న రాత్రి పూనం మరోమారు ఈ వివాదంలోకి దిగిపోయారు. ట్విట్టర్ వేదికగా పూనం సంధించిన ఓ ట్వీట్ ఇప్పుడు కత్తి మహేశ్ తో పాటుగా పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో సెటైర్లు విసిరే బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను కూడా టార్గెట్ చేసినట్లుగానే కనిపిస్తోంది. డిజిటల్ మీడియా వేదికగా వర్మ *గాడ్ - సెక్స్ అండ్ ట్రూత్* పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా... ఈ నెల 26న విడుదల కానున్న ఈ చిత్రంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ క్రమంలో నిన్న ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో వర్మతో పాటుగా కత్తి మహేశ్ పాల్గొన్నారు. ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన సామాజిక ఉద్యమకారిణి దేవి.. వర్మను కడిగిపారేయడం - దానికి వర్మ కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడం తెలిసిందే.

ఈ టీవీ షో ముగిసిన కాసేపటికే ట్విట్టర్ లో ప్రత్యక్షమైన పూనం... తనదైన శైలిలో వర్మ చిత్రంపై - టీవీ షోపై కామెంట్లు చేశారు. అయినా సదరు ట్వీట్ లో పూనం ఏమన్నారన్న విషయానికి వస్తే... *భారతదేశంలో సాధారణ యువతుల కంటే పోర్న్ స్టార్స్ చాలా గౌరవాన్ని పొందుతూ - మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవేళ సాధారణ యువతులు దేనిపై అయినా స్పందిస్తే మాత్రం.. సంబంధం లేని విషయాలను అంటగడుతూ లేని పోని నిందలు వేస్తున్నారు అని పూనమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒరకంగా అంతా కలిసి యువతుల ఆత్మను - మనసును - శరీరాన్ని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు* అని పూనం తనదైన శైలిలో కామెంట్ చేశారు. అయితే మొన్న చేసిన ట్వీట్ నే కొద్ది క్షణాల్లోనే డిలీట్ చేసిన పూనం... మరి ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి.