Begin typing your search above and press return to search.

మిడ్‌ నైట్‌ లో పోలీస్ త‌లుపులు బాదారు!

By:  Tupaki Desk   |   9 Nov 2018 4:49 AM GMT
మిడ్‌ నైట్‌ లో పోలీస్ త‌లుపులు బాదారు!
X
ఓటు హ‌క్కు గొప్ప‌త‌నం గురించి వివ‌రిస్తూ - కాసుల‌కు ప్ర‌జ‌లు అమ్ముడుపోవ‌డం అన్న పాయింట్‌ ని హైలైట్ చేస్తూ ఏ.ఆర్‌.మురుగ‌దాస్ `స‌ర్కార్` చిత్రాన్ని తెర‌కెక్కించారు. త‌మిళ‌నాడులోని అధికార పార్టీ ఏఐడీఎంకే కు వ్య‌తిరేకంగా - అమ్మ జ‌య‌ల‌లిత‌ను విమ‌ర్శించే విధంగా ఈ సినిమా ఉందంటూ పెనువివాదం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి కొన్ని సీన్లు తొల‌గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు రాజ‌కీయ నాయ‌కులు.

అంతేకాదు.. మురుగ‌దాస్‌ ని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని త‌మిళ‌నాట ఒక‌టే ప్ర‌చారం హోరెత్తిపోతోంది. ఆ క్ర‌మంలోనే ఓ బ్రేకింగ్ న్యూస్‌. మురుగ‌దాస్ ఇంటికి పోలీసులు వెళ్లార‌న్న వార్త‌ను స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ బ్రేకింగ్ న్యూస్ అంటూ ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేసింది. దీంతో త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం మొద‌లైంది. కోలీవుడ్ హీరోలంతా దీనిని ఖండిస్తూ ట్వీట్లు పెట్టారు. ముఖ్యంగా ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ ఈ వ్య‌వ‌హారంపై సీరియ‌స్‌ గానే స్పందించారు. సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ చేసిన సినిమాని అడ్డుకోవ‌డం ఇక్క‌డ‌ ప్ర‌భుత్వాల‌కు కొత్తేమీ కాదు. వీళ్ల‌కు అల‌వాటే. క‌మ‌ర్షియ‌ల్ రాజ‌కీయ నాయ‌కులు అంతం అవుతారు. మంచి వారు ఈసారి ఎన్నిక‌వుతారు.. అంటూ ట్వీట్ చేశారు. ఒక‌సారి సెన్సార్ అయిన చిత్రాన్ని అడ్డుకోవ‌డం చ‌ట్ట‌విరుద్ధం.. ఈ చ‌ర్య‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ సీరియ‌స్ అయ్యారు. నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు - హీరో విశాల్ స్పందిస్తూ సెన్సార్ అయిన సినిమాని అడ్డుకోకూడ‌దు. ప్ర‌జ‌లు చూడొచ్చ‌నే సెన్సార్ చేస్తారు. అడ్డుకోవాల్సిన అవ‌స‌ర‌మేంటి? అంటూ నిల‌దీశాడు.

దీనిపై మురుగ‌దాస్ కూడా ట్వీట్ చేయ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది.`` అర్థ‌రాత్రి వేళ మా ఇంటికి పోలీసులు వ‌చ్చారు. ప‌దే ప‌దే త‌లుపుల్ని ద‌బా ద‌బా బాదారు. నేను అక్క‌డ లేక‌పోవ‌డంతో వాళ్లు వెళ్లిపోయారు. ఇప్పుడు మా ఇంటి ముందు పోలీస్ బందోబ‌స్తు లేదు`` అంటూ మురుగ‌దాస్ ట్వీట్ చేశాడు. `స‌ర్కార్` విష‌యంలో కోలీవుడ్ యావ‌త్తూ మురుగ‌దాస్ వైపు నిల‌బ‌డ‌డం.. ప్ర‌భుత్వ చ‌ర్య‌ను ఖండించ‌డం చ‌ర్చ‌కొచ్చింది.