Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : పెళ్లిచూపులు

By:  Tupaki Desk   |   29 July 2016 5:51 AM GMT
మూవీ రివ్యూ : పెళ్లిచూపులు
X
చిత్రం: ‘పెళ్లిచూపులు’

నటీనటులు: విజయ్ దేవరకొండ - రితు వర్మ - నందు - అనీష్ కురువిల్లా - గురురాజ్ మానేపల్లి - ప్రియదర్శి తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
నిర్మాతలు: రాజ్ కందుకూరి - యాష్ రంగినేని
రచన - దర్శకత్వం: తరుణ్ భాస్కర్

పెళ్లిచూపులు.. చడీచప్పుడు లేకుండా పూర్తయి.. ఒక మంచి ట్రైలర్ తో జనాలకు పరిచయమైన సినిమా. విడుదలకు ముందే ఎంతో ఆసక్తి రేకెత్తించిన సినిమా. ఎంతో చర్చనీయాంశమైన సినిమా. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో అంత విశేషం ఏముందో చూద్దాం పదండి.

కథ:

ఇంజినీరింగ్ పూర్తయిన రెండేళ్లకు సప్లిమెంటరీలు రాసి అతి కష్టం మీద డిగ్రీ తెచ్చుకున్న కుర్రాడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). ఎంబీఏ పూర్తి చేసి తన కాళ్ల మీద తాను నిలబడాలని ఆరాటపడే అమ్మాయి చిత్ర (రితు వర్మ). ఏ పనీ చేయడం చేతకాక కట్నం కోసం ఓ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు ప్రశాంత్. తండ్రి బలవంతం మీద తన ఆశల్ని చంపుకుని బలవంతంగా పెళ్లిచూపులకు తయారవుతుంది చిత్ర. వీళ్లిద్దరూ పెళ్లిచూపుల్లో కలుస్తారు. ఒకరి అభిప్రాయాలు పంచుకుంటారు. ఈ పెళ్లిచూపుల పరిచయం వాళ్లిద్దరి జీవితాల్ని ఏ మలుపు తిప్పిందన్నది కథ.

కథనం-విశ్లేషణ:

అప్పుడెప్పుడో తెలుగు తెరను ఓ మలయమారుతంలా తాకింది ‘ఆనంద్’. సినిమా అంటే ఇలాగే ఉండాలి.. కథను ఇలాగే చెప్పాలి.. ఇలాగే ముగించాలి.. అంటూ అప్పటిదాకా ఉన్న సూత్రాలన్నింటినీ బ్రేక్ చేస్తూ తనదైన శైలిలో ఓ సినిమా తీసి.. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాడు శేఖర్ కమ్ముల. మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమా సూత్రాల్ని రీడిఫైన్ చేస్తూ ఒక రిఫ్రెషింగ్ సినిమా వచ్చింది. అదే.. పెళ్లిచూపులు. నిజానికి ‘పెళ్లిచూపులు’ మరో సినిమాతో పోల్చదగ్గ సినిమా కాదు. ఇది ఈ చిత్ర బృందం ప్రచారం చేసుకున్నట్లే.. న్యూ ఏజ్ రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ.

పెద్దగా మలుపులు.. హడావుడి ఏమీ లేని ఓ సింపుల్ కథ.. రెండు గంటల పాటు బోర్ కొట్టించకుండా సరదాగా సాగిపోయే కథనం.. డ్రామా లేకుండా సహజంగా నడిచే సన్నివేశాలు.. మాటలు.. ఈ కథాకథనాలకు తగ్గట్లుగా ఆహ్లాదకరమైన సంగీతం.. ఛాయాగ్రహణం.. బలమైన పాత్రలు.. నటిస్తున్నట్లు కాకుండా బిహేవ్ చేస్తున్నట్లుగా అతికినట్లు ఉన్న నటీనటుల అభినయం.. వీటన్నింటి మిశ్రమమే ‘పెళ్లిచూపులు’.

సినిమాలో ఏదీ వృథా పాత్రలా అనిపించదు. ప్రతి పాత్రకూ ఓ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. హీరో హీరోయిన్ల పాత్రలు ఈ తరం అబ్బాయిలు అమ్మాయిలకు ప్రతిబింబాల్లా కనిపిస్తాయి. పాత్రల పరిచయం తర్వాత కొద్దిసేపటికి సినిమా చూస్తున్న సంగతి మరిచిపోయి.. ఆయా పాత్రలతో కలిసి ట్రావెట్ చేస్తాం. వాళ్లతోనే ఉంటూ వాళ్ల మధ్య జరిగేదంతా చూస్తున్న భావనకు లోనవుతాం. పాత్రలు.. వాటి మధ్య నడిచే వ్యవహారాలు అంత సహజంగా ఉంటాయి. నటీనటులకు డైలాగులేమీ ఇవ్వకుండా.. సన్నివేశం చెప్పి ‘మాట్లాడుకోండి’ అని దర్శకుడు చెప్పాడేమో అనిపిస్తుంది. అలాగని సహజత్వం పేరుతో సాగతీత ఉండదు. ఆసక్తి లేకపోవడమూ ఉండదు.

స్పూఫులు.. పేరడీలు.. బూతులే చాలా వరకు కామెడీగా చెల్లిపోతున్న ఈ రోజుల్లో ‘పెళ్లిచూపులు’లోని సునిశితమైన హాస్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్ సన్నివేశాలతోనే కడుపుబ్బ నవ్వించాడు దర్శకుడు. హీరోతో పాటు అతడి స్నేహితులు కలిసి పండించిన కామెడీ బాగా వర్కవుటైంది. ముఖ్యంగా ప్రియదర్శి చేసిన కామెడీ సినిమాకు హైలైట్. యూట్యూబ్ వీడియో కామెడీ పేలిపోయింది. ఈ రొమాంటిక్ కామెడీలో ప్రధానంగా వినోదం పండించడానికే ప్రయత్నం జరిగినా.. కొన్ని బలమైన ఎమోషనల్ సీన్స్ కూడా పడ్డాయి. హీరో హీరోయిన్ ఇంటికెళ్లి.. హీరోయిన్ హీరో ఇంటికెళ్లి.. ఒకరి గురించి ఒకరు చెప్పుకుని.. వాళ్ల తల్లిదండ్రుల్లో రియలైజేషన్ వచ్చేలా చేసే సన్నివేశాల్లో ఎమోషన్ బాగా పండింది. క్లైమాక్స్ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉండాల్సింది. అక్కడ మరింత మంచి డైలాగులు పడాల్సింది.

కథ ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లుగా సాగడం.. నరేషన్ కొంచెం నెమ్మదిగా ఉండటం.. ఇవి రెండే సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్ లు. కానీ అవి మరీ అంత ఇబ్బంది పెట్టేలాగా కూడా ఉండవు. హీరో హీరోయిన్లు తొలిసారి కలవడానికి ముందే వాళ్లిద్దరినీ వేరే రకంగా కనెక్ట్ చేయడం.. హీరో పెళ్లిచూపుల కోసం ఇంకో ఇంటికి వెళ్లబోయి హీరోయిన్ ఇంటికి వెళ్లడం.. అక్కడ కూడా పెళ్లిచూపుల సెటప్ ఉండటం.. ఇలాంటి కోయిన్సిడెన్సెస్ కొంచెం సినిమాటిగ్గా అనిపిస్తాయి. చాలా వరకు సహజత్వంతో కథనాన్ని నడిపించాలని ప్రయత్నించిన దర్శకుడు.. ఇక్కడ మాత్రం కొంచెం లిబర్టీ తీసుకున్నాడు.

‘పెళ్లిచూపులు’ అనేది ప్రధానంగా అర్బన్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సినిమా. ఇందులోని పాత్రలు.. వారి మధ్య సంభాషణలు.. సన్నివేశాలు అన్నీ కూడా ఆ వర్గం ప్రేక్షకులకు కనెక్టయ్యేలా ఉంటాయి. టార్గెటెడ్ ఆడియన్స్ ను ‘పెళ్లిచూపులు’ పూర్తిగా మెప్పిస్తుంది. మిగతా ప్రేక్షకులకు ముఖ్యంగా మాస్ మసాలా సినిమాల్ని మాత్రమే ఇష్టపడేవాళ్లకు ‘పెళ్లిచూపులు’ అంతగా రుచించకపోవచ్చు.

నటీనటులు:

తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’లోనే తన టాలెంట్ ఏంటో రుజువు చేసుకున్న విజయ్ దేవరకొండ.. ‘పెళ్లిచూపులు’తో ఒకేసారి చాలా మెట్లు ఎక్కేశాడు. చేస్తోంది రెండో సినిమానే అయినా చాలా అలవాటైన నటుడిలా కనిపిస్తాడతను. విజయ్ పాత్ర.. అతడి నటన అంత బాగా అనిపిస్తాయి. సినిమాలో విజయ్ కాకుండా ప్రశాంతే కనిపిస్తాడు. బాధ్యత లేని కుర్రాడి పాత్రలో అతను జీవించేశాడు. అతడి హావభావాలు చాలా సహజంగా.. ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి.

హీరోయిన్ రితు వర్మ కూడా చాలా బాగా చేసింది. ఆమె పోషించిన చిత్ర పాత్ర ‘ఆనంద్’లో ‘రూప’ను గుర్తుకు తెస్తుంది. తెలుగు సినిమాల్లో ఇంత బలమైన హీరోయిన్ పాత్ర చూడటం అరుదు. ఇలాంటి పాత్రకు రితుకు దక్కడం ఆమె అదృష్టమే. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. ఆమె బాడీ లాంగ్వేజ్.. లుక్స్ విషయంలోనూ జాగ్రత్తపడ్డారు. తర్వాత చెప్పాల్సింది హీరో ఫ్రెండు పాత్రలో నటించిన ప్రియదర్శి గురించి. హైదరాబాదీ తెలంగాణ యాసలో అదరగొట్టాడతను. మున్ముందు అతణ్ని చాలా సినిమాల్లో చూసే అవకాశముంది. ఇంకో ఫ్రెండు పాత్రలో చేసిన నటుడూ బాగా చేశాడు. నందు.. అనీష్ కురువిల్లా.. గురురాజ్ మానేపల్లి.. హీరో తండ్రి పాత్రలో నటించిన నటుడు.. వీళ్లందరూ కూడా చాలా బాగా నటించారు.

సాంకేతికవర్గం:

వివేక్ సాగర్ వీనుల విందైన సంగీతంతో.. నగేష్ బానెల్ ఆహ్లాదకరమైన ఛాయాగ్రహణంతో సినిమాకు బలంగా నిలిచారు. పాటలు.. నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్లో వచ్చే హమ్మింగ్స్ ఆయా సన్నివేశాల్ని మరింత ఆహ్లాదంగా మార్చాయి. నగేష్ కెమెరా పనితనం కూడా సినిమాను మరింత అందంగా మార్చింది. సాంకేతిక విభాగాల మధ్య చక్కటి సమన్వయం కనిపిస్తుంది. సౌండ్ డిజైనింగ్.. ఎడిటింగ్ అన్నీ కూడా చక్కగా కుదిరాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ వీళ్లందరినీ కోఆర్డినేట్ చేసుకుని చక్కటి ఔట్ పుట్ రాబట్టుకున్నాడు.

తరుణ్ దర్శకత్వ ప్రతిభ గురించి చెప్పడానికి చాలా ఉంది. అతడి నరేషన్ కొత్తగా అనిపిస్తుంది. భారీ కథ.. ట్విస్టులు.. హడావుడి.. పేరున్న నటీనటులు.. హంగులు ఆర్భాటాలు ఏమీ లేకుండా ఒక సింపుల్ కథను ఆహ్లాదకరంగా నరేట్ చేశాడతను. ఫిలిం మేకింగ్ విషయంలో అతడికున్న క్లారిటీ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. నటీనటుల నుంచి.. సాంకేతిక నిపుణుల నుంచి అత్యుత్తమ ప్రతిభ రాబట్టుకోవడంలోనూ తరుణ్ తనదైన ముద్ర వేశాడు. ఎలాంటి డ్రామాకు అవకాశం లేకుండా సన్నిశాల్ని సహజంగా తీర్చిదిద్దిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చివరగా చూస్తే తప్ప వింటున్నపుడు గొప్పదనం తెలియని ఇలాంటి కథతో సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతలు రాజ్ కందుకూరి-యాష్ రంగినేనిలను.. ఈ సినిమాకు ప్రోత్సాహాన్నందించిన సురేష్ బాబుకు అభినందనలు చెప్పాలి.

చివరగా: పెళ్లిచూపులు.. ఓ మధుర జ్నాపకం.

రేటింగ్: 3.25/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre