పవన్..మహేష్..అంత అత్యాశైతే ఎలాగబ్బా?

Sun Jul 16 2017 15:21:51 GMT+0530 (IST)

ఒకప్పుడు అమెరికాలో తెలుగు సినిమా రిలీజవ్వడమే గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడక్కడ మన సినిమాలు మిలియన్ డాలర్లలో వసూళ్లు రాబడుతున్నాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ అయితే ఏకంగా 20 మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టింది అమెరికాలో. వేరే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా అమెరికాలో మంచి వసూళ్లే రాబడుతుంటాయి. ఈ విషయంలో బాలీవుడ్ వాళ్లు కూడా మన హీరోల ముందు దిగదుడుపే. తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అన్నది బంగారు బాతు లాంటిదే అని చెప్పాలి. కానీ అత్యాశకు పోయి ఈ బాతును కబళించేయాలని చూస్తుండటమే విచారించాల్సిన విషయం. ఏమీ లేని చోట ఇంత మంచి మార్కెట్ పెరిగిందని.. అదనపు ఆదాయం వస్తోందని మన నిర్మాతలు సంతృప్తి చెందట్లేదు. అత్యాశకు పోయి ఓవర్సీస్ నుంచి అయిన కాడికి దండుకోవాలని చూస్తుండటంతో వస్తోంది సమస్య. పెద్ద సినిమాలు రోజు రోజుకూ రేట్లు పెంచేసి ఓవర్సీస్ బయ్యర్లతో జూదం ఆడుతున్నాయి. మరీ ఎక్కువ రేట్లు పెట్టేస్తున్న బయ్యర్లు.. సినిమా తేడా కొట్టిందంటే నిలువునా మునిగిపోతున్నారు.

ఈ మధ్యే అల్లు అర్జున్ సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా మీద ఉన్న హైప్ చూసి.. దీనిపై యుఎస్ బయ్యర్ భారీగా పెట్టుబడి పెట్టాడు. రూ.9 కోట్లకు సినిమాను కొన్నాడు. ఆ పెట్టుబడి రికవర్ అయి.. బయ్యర్ లాభాల బాట పట్టాలంటే ఈ చిత్రం ఇక్కడ 2 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. కానీ ఈ చిత్రం ఫుల్ రన్లో 1.2 మిలియన్ డాలర్ల లోపే వసూలు చేసింది. బయ్యర్ కు దాదాపు రూ.4 కోట్ల దాకా నష్టం అంటున్నారు. పెద్ద సినిమాలతో ఓవర్సీస్ మార్కెట్ జూదం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక రుజువు.

మహేష్ బాబును ఓవర్సీస్ లో తిరుగులేని స్టార్ అంటుంటారు. కానీ మహేష్ లాస్ట్ మూవీ ‘బ్రహ్మోత్సవం’ ఓవర్సీస్ లో దారుణమైన ఫలితాన్నిచ్చింది. భారీ నష్టాలు మిగిల్చింది. పవన్ కళ్యాణ్ గత రెండు సినిమాలూ (సర్దార్ గబ్బర్ సింగ్ - కాటమరాయుడు) అక్కడ తేలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా కొన్నిసార్లు కలెక్షన్లు వచ్చేస్తాయి కానీ.. అమెరికాలో అలా కాదు. అక్కడ భారీ రేట్లకు సినిమాను కొంటారు కాబట్టి బయ్యర్లు టికెట్ల రేట్లు ఎక్కువ పెడతారు. కాబట్టి సినిమా బాగుందంటే తప్ప జనాలు థియేటర్లకు వెళ్లరు. టాక్ అక్కడ చాలా కీలకం. అది తేడా వస్తే సినిమా నిలవడం కష్టం. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ లో పెద్ద సినిమాల మీద పెట్టుబడి పెట్టేందుకు బయ్యర్లు వెనుకంజ వేస్తున్నారు. ఐతే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పవన్.. మహేష్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ రేట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా రేటు రూ.20 కోట్ల పై మాటేనట. మహేష్ బాబు ‘స్పైడర్’ విషయంలోనూ రూ.20 కోట్లకు తక్కువ మాట్లాడట్లేదు. ఐతే బయ్యర్లు ఈ రేట్లకు కొనడానికి భయపడుతున్నారు. రూ.20 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. 4 మిలియన్ డాలర్ల దాకా వస్తే తప్ప బయ్యర్ సేఫ్ కాడు. ఇంతేసి రేట్లకు సినిమా కొని.. రేప్పొద్దున తేడా వస్తే నష్టాలు భారీగా ఉంటాయి. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే లాభాలు మరీ పెద్ద స్థాయిలో ఏమీ ఉండవు. లాభం వస్తే అది తక్కువగా ఉంటుంది. నష్టం వస్తే మాత్రం భారీగా ఉంటుంది. చిన్న సినిమాల మీద తక్కువ పెట్టుబడి పెడితే.. రిస్క్ తక్కువగా ఉంటుంది. సినిమా క్లిక్ అయితే లాభాలు భారీగా ఉంటాయి. పోయినేడాది క్షణం.. పెళ్లిచూపులు లాంటి సినిమాలు వాటి బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే పెద్ద సినిమాల విషయంలో మునుపటితో పోలిస్తే ఓవర్సీస్ బయ్యర్లు అంత ఆసక్తి చూపించట్లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితి గమనించి బడా సినిమాల నిర్మాతలు ఓవర్సీస్ హక్కుల విషయంలో కొంచెం అత్యాశ తగ్గించుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.