Begin typing your search above and press return to search.

కొంచెం తగ్గండి సూపర్ స్టార్లూ..

By:  Tupaki Desk   |   20 Jan 2018 2:30 AM GMT
కొంచెం తగ్గండి సూపర్ స్టార్లూ..
X
పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. వీరిలో ఎవరూ ఎవరికీ తక్కువ కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ విషయంలో ఎవరికి వాళ్లే సాటి. అలాగే వీళ్ల సినిమాలు ఫ్లాప్ అయితే నష్టాలు మిగిల్చే విషయంలో విషయంలో కూడా ఎవరికి ఎవరూ తీసిపోరు. మహేష్ బాబు చివరగా నటించిన ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్టర్లే. అందులో ఒకదాన్ని మించి ఒకటి నష్టాలు తెచ్చిపెట్టాయి. చివరగా వచ్చిన ‘స్పైడర్’ నష్టాల విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇక పవన్ గత రెండేళ్లలో చేసిన రెండు సినిమాలూ దారుణమైన నష్టాలు మిగిల్చాయి. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ నష్టాల విషయంలో అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. ‘స్పైడర్’ను కూడా మించిపోయి రూ.60 కోట్లకు పైగా నష్టాలు మిగల్చబోతోందని అంచనా వేస్తున్నారు.

రెండు మూడేళ్ల కిందటి వరకు కూడా ఏదైనా పెద్ద సినిమా డిజాస్టర్ అయినా 20-30 కోట్ల మధ్య నష్టాలుండేవి. కానీ ఇప్పుడు నష్టాలు రూ.50-60 కోట్లకు మధ్య చేరిపోవడమే విడ్డూరం. ఇందుక్కారణం సినిమాను మితిమీరిన రేట్లకు అమ్మడం. అలా ఎందుకు అమ్ముతున్నారు అంటే.. బడ్జెట్లు పెరిగిపోవడం వల్లే. మరి సినిమాల బడ్జెట్లు ఉన్నట్లుండి అంత ఎందుకు పెరిగిపోయాయి అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ప్రొడక్షన్ ఖర్చేమీ ఆ స్థాయిలో పెరిగిపోలేదు. పారితోషకాలు పెరిగపోవడంతోనే సమస్య వస్తోంది. తమ మార్కెట్ పరిధి పెరిగిందని చెప్పుకుంటూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరోలు పారితోషకం పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు. పవన్.. మహేష్ మినిమం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల దాకా పుచ్చుకుంటున్నట్లు వినికిడి. ఇక వాళ్లకు పెద్ద డైరెక్టర్ తోడయ్యాడంటే రూ.10-15 కోట్ల దాకా పారితోషకం ఇచ్చుకోవాలి.

ఇక వాళ్ల సినిమాల్లో అందరూ టాప్ లెవెల్ టెక్నీషియన్లు.. నటీనటులే ఉంటారు. అలా అందరి పారితోషకాలూ కలిపి రూ.70 కోట్లు దాటిపోతోంది. వంద కోట్ల బడ్జెట్ అంటే.. అందులో ప్రొడక్షన్ కోసం పెడుతున్నది 25-30 శాతమే. మిగతా అంతా పారితోషకాలకే పోతోంది. కథ ఎలాంటిదైనా బడ్జెట్ మాత్రం వంద కోట్లకు చేరిపోతోంది. కొంచెం పారితోషకం తగ్గించుకుని తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసే ప్రయత్నాలేమీ చేయట్లేదు ఈ సూపర్ స్టార్లు. దీంతో వీళ్ల సినిమాలు కొనడం జూదంగా మారిపోతోంది. టాక్ పాజిటివ్ గా ఉండి ఎంత మంచి వసూళ్లు సాధించినా లాభాలు 25 శాతానికి మించట్లేదు. కానీ టాక్ తేడా వస్తే మాత్రం నష్టాలు సగానికి సగం ఉంటున్నాయి. వీళ్లకున్న క్రేజ్ దృష్ట్యా సినిమా ఇలా మొదలవడం ఆలస్యం.. బయ్యర్లు అలా ఎగబడిపోతున్నారు. అయిన కాడికి సినిమాలు కొంటున్నారు. తేడా వస్తే నిండా మునిగిపోతున్నారు. మరి ఈ పోకడ ఇలా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.