పవన్ సాక్ష్యంగా నిలుస్తాడా

Wed May 16 2018 11:48:59 GMT+0530 (IST)

రాజకీయాల్లోనే ఉంటాను సినిమాలు మానేస్తున్నాను అని ప్రకటించాక కొన్ని విషయాల్లో పవన్ దృక్పధంలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నడూ లేనిది ఈ మధ్య తనవి కాని సినిమా వేడుకలు వరస బెట్టి హాజరవుతున్నాడు. ఇటీవలే ఒకే రోజు అందులోనూ ఒకే సాయంత్రం పూట నా పేరు సూర్య-నేల టికెట్టు ఈవెంట్స్ కు వచ్చిన పవన్ అందరికి షాకిచ్చాడు. అంతకు ముందు రంగస్థలం సక్సెస్ మీట్ కు వెళ్ళినప్పుడు కూడా అందరు ఆశ్చర్యపోయారు. ఈ మూడు సినిమాల వేడుకలకు వెళ్ళడం వెనుక రకరకాల కారణాలు వినిపిస్తున్నప్పటికీ ఒక్కటి మాత్రం నిజం. ఇంతకన్నా బలమైన రీజన్స్ ఉన్నప్పుడు కూడా పవన్ చాలా వాటికి వెళ్ళలేదు. ఇదలా ఉంచితే తాజాగా మరో వేడుకకు కూడా పవన్ హాజరయ్యే అవకాశాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరొయిన్ గా దర్శకుడు శ్రీవాస్ రూపొందిస్తున్న సాక్ష్యం సినిమా ఆడియో రిలీజ్ ఈ నెల 26న జరగనుంది. ఇప్పటికే టీజర్ ఆసక్తి రేపగా దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఆల్బంలోని ఒకపాట కొద్ది రోజుల క్రితం విడుదల చేసారు. ఇప్పుడు ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను అతిధిగా రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఒకవేళ అదే కనక నిజమైతే కేవలం నెల రోజుల గ్యాప్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న నాలుగో వేడుక అవుతుంది. ఇది ఒకరకంగా రికార్డే. జనసేన కార్యకలాపాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలు చూసుకుని మరీ పవన్ కళ్యాణ్ ఇలా ఇతర హీరోల సినిమా ఈవెంట్స్ కు వెళ్ళడం చూస్తుంటే పవర్ ఫాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఇలా వరసబెట్టి పవన్ వెళ్ళింది లేదు కనకే ఇది హై లైట్ అవుతోంది. పవన్ అతిధిగా సాక్ష్యం వేడుకకు రాబోతున్నడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.