ఇంటర్ ఆత్మహత్యలు .. మళ్లీ పవన్ ఎమోషన్

Sun Sep 22 2019 22:42:27 GMT+0530 (IST)

సైరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆద్యంతం మెగా హీరోల ఎమోషన్ హైలైట్ గా కనిపించింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశభక్తి గురించి .. ఉయ్యాలవాడ గొప్పతనం గురించి .. అన్నయ్య చిరంజీవి గురించి ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. అంతేకాదు ఇదివరకూ మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో ప్రస్థావించిన తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల గురించి మరోసారి ప్రస్థావించారు. తాను కూడా ఆ వయసులో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేసుకుని పవన్ ఎమోషన్ అయ్యారు.అన్నయ్య చిరంజీవికి మీలో ఒకడిగా నేనూ అభిమానినే. మీలానే నేను కూడా గుండెను పంచుకుంటాను. చాలా పోటీతత్వం ఉన్న పరిశ్రమ ఇది. ఇక్కడ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నయ్య.. అని అన్నారు. తనను అభిమానులు ఇంతగా ప్రేమిస్తున్నారంటే అందుకు కారణం చిరంజీవి అని అన్నారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఇంటర్ పూర్తి చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డాను నేను కూడా. ఆ సమయంలో అన్నయ్య పిస్తోలు తీసుకుని కాల్చుకుందామనుకున్నా.. ఆ సమయంలో ప్రతి ఎగ్జామ్ ని నేను కొలమానంగా చూడను. జీవితంలో ఎదగడమే కొలమానంగా చూస్తాను.. అని అన్నయ్య అన్నారు. అన్నయ్య తనకు ఇచ్చిన ధైర్యం.. గుండె బలాన్ని ఏ రోజు వదిలి పెట్టలేదు. అన్నయ్యలా చెప్పే వ్యక్తులు ఆ కుటుంబాల్లో ఉండి ఉంటే ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారు కాదేమో అని ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశం తాలుకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా ఇది. అన్ని దేశాలు భారత్ పైన దాడి చేసాయి. కానీ భారత్ మాత్రం ఎప్పుడూ ఇతర దేశాలపై దాడి చేయలేదు. భారతదేశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహానుభావుల సమాహారం.. అనీ అన్నారు. గాంధీ జయంతి రోజున ఈ సినిమా విడుదల కావడం సంతోషించదగ్గది. భగత్ సింగ్- చంద్రశేఖర్ ఆజాద్- మహాత్మా గాంధీ-సర్దార్ వల్లబాయ్ పటేల్-అంబేడ్కర్ జీవిత చరిత్రలు మనకు వారి త్యాగాల్ని చెబుతాయి. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి మన దేశం కోసం తీసిన సినిమా అని అన్నారు.