Begin typing your search above and press return to search.

ఆ మంచి పని కోసం పవన్ కు త్రివిక్రమ్ సాయం

By:  Tupaki Desk   |   22 Jan 2017 7:49 AM GMT
ఆ మంచి పని కోసం పవన్ కు త్రివిక్రమ్ సాయం
X
పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ ఎంతటి మిత్రుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘జల్సా’తో మొదలైన వీరి ప్రయాణం కేవలం సినిమాలకు వరకు పరిమితం కాలేదు. వ్యక్తిగతంగానూ చాలా క్లోజ్ అయిపోయారు. ఒకరికొకరు ఎన్నో సాయాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు తెరవెనుక త్రివిక్రమ్ చాలా సాయమే చేశాడంటారు. ఆయన ప్రసంగాల్లో త్రివిక్రమ్ పాత్ర గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అలాగే త్రివిక్రమ్ కు అవసరమైనపుడు పవన్ కూడా సాయం చేశాడు. తాజాగా పవన్ త్రివిక్రమ్ ను ఓ సాయం అడిగినట్లు సమాచారం. అది ఓ మంచి కాజ్ కోసం కావడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల దయనీయ స్థితిని చూసి కరిగిపోయిన పవన్ కళ్యాణ్.. చేనేత ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మొక్కుబడిగా కాకుండా కొంచెం సీరియస్ గానే చేనేత ఉత్పత్తులకు పవన్ ప్రచారం చేయాలనుకుంటున్నాడట. ఇందుకోసం ఓ యాడ్ షూట్లో కూడా పవన్ పాల్గొనబోతున్నాడట. ఇందుకోసం త్రివిక్రమ్ ను ఓ కాన్సెప్ట్ రెడీ చేయమని పవన్ చెప్పినట్లు సమాచారం. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఆ ప్రకటన చేసే అవకాశముంది. మరి ఈ ప్రకటన ఎలా ఉంటుందో చూడాలి. మామూలుగా వాణిజ్య ఉత్పత్తుల ప్రచారానికి పవన్ దూరం. ఐతే నేతన్నల కోసం పవన్ మనసు మార్చుకున్నాడు. ఓ మంచి పని కోసం పవన్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.