Begin typing your search above and press return to search.

రేణు అడిగింది.. పవన్ సాయం చేశాడు

By:  Tupaki Desk   |   12 May 2016 4:22 PM GMT
రేణు అడిగింది.. పవన్ సాయం చేశాడు
X
అవును.. రేణు దేశాయ్ సాయం చేయమని అడిగింది. పవన్ సాయం చేశాడు. ఐతే ఇక్కడ సాయం పొందింది రేణు దేశాయ్ కాదు. కాలేజీ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఒక పేదింటి అమ్మాయి. తనకు సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ రిక్వెస్ట్ పంపితే.. దానికి స్పందించి రేణు దేశాయ్ ఓ అమ్మాయికి పవన్ ద్వారా సాయం అందించడం విశేషం. చేసింది చిన్న సాయమే అయినా.. రేణు-పవన్ లది చాలా పెద్ద మనసు అంటూ ఆ అమ్మాయి ట్విట్టర్లో పోస్టు పెట్టడంతో ఈ విషయం సోషల్ మీడియా అంతటా పాకిపోయింది.

లక్ష్మి దుర్గా డేగల అనే అమ్మాయి డిగ్రీ చదువుకుంటోంది. ఆమె తండ్రి ఈ మధ్యే చనిపోయాడు. దీంతో కళాశాలలో ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఎదురైంది. సోషల్ మీడియాలో తన పరిస్థితి వివరిస్తూ ఆమె సాయం కోరింది. కానీ ఇదేదో ఫేక్ వ్యవహారం అనుకుని ఎవ్వరూ స్పందించలేదు. ఐతే ట్విట్టర్లో రేణు దేశాయ్ కు నేరుగా తన పరిస్థితి వివరిస్తూ మెసేజ్ పెట్టింది లక్ష్మి దుర్గా. వెంటనే స్పందించిన రేణు.. తన వివరాలు చెప్పమని మేనేజర్ ద్వారా వెరిఫై చేసుకుంది.

ఆ అమ్మాయి నిజంగానే కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకుని పవన్ ను కాంటాక్ట్ చేసి విషయం చెప్పింది. పవన్ అసిస్టెంట్ ఒకరు ఆ అమ్మాయి చదువుతున్న కళాశాలకు వెళ్లి ఫీజు కట్టి వచ్చారు. దీంతో ఆ అమ్మాయి ఆనందానికి అవధుల్లేవు. రేణు, పవన్ లకు కృతజ్నతలు చెబుతూ ఆమె ట్వీట్లు చేసింది. ఆ తర్వాత రేణు కూడా స్పందించింది. చదివి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురమ్మని విష్ చేసింది. లక్ష్మి దుర్గా ట్వీట్లను షేర్ చేస్తూ పవన్ అభిమానులు తమ హీరో గొప్ప మనసు గురించి అందరికీ చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.